బైక్‌ దొంగ.. పెట్రోల్‌ అయిపోగానే వదిలేస్తాడు..!

10 Jan, 2020 10:05 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ నర్సింహారెడ్డి

బైక్‌లను అపహరిస్తాడు.. పెట్రోల్‌ అయిపోగానే వదిలేస్తాడు..!

కటకటాలపాలైనా మారని తీరు రెండు దశాబ్దాలుగా చోరీలు

20 బైక్‌ల తస్కరణ ‘గుట్ట’లో వాహనాలు

తనిఖీ చేస్తుండగాపోలీసులకు పట్టుబడిననిందితుడు

చోరీ చేయడం అతడికి సరదా..!దుకాణ సముదాయాలు.. పార్కింగ్‌ప్రదేశాల్లో ఉంచిన బైక్‌లను చాకచక్యంగా అపహరిస్తాడు.. అలా అని వాటిని విక్రయించి సొమ్ము చేసుకోడు.. తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్తాడు..మార్గమధ్యలో పెట్రోల్‌ అయిపోతే ఆ బైక్‌ను అక్కడే వదిలేసి మరో వాహనాన్ని చోరీ చేసి వెళ్తుంటాడు.. 22ఏళ్ల క్రితం ప్రారంభమైన అతడి చోరీల ప్రస్థానంలో రెండుసార్లు జైలుకెళ్లినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. తాజాగా మరో బైక్‌ను అపహరించి పోలీసులకు చిక్కాడు.. వివరాల్లోకి వెళితే.

యాదగిరిగుట్ట (ఆలేరు) : అంతర్‌జిల్లా బైక్‌ దొంగను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు లు అరెస్ట్‌ చేశారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ లో గురువారం ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి వివ రాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వరాల మురళీధర్‌రావు వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అదే క్రమంలో సరదా కోసం బైక్‌లను చోరీ చేయ డం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. 1998లో ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాలుగు బైక్‌లను దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మురళీధర్‌రావు తిరిగి 2002లో మళ్లీ అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆరు బైక్‌లను అపహరించి అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత 2017లో హైదరాబాద్‌లోని మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఐదు బైక్‌లు చోరీ చేశాడు.

భక్తుడి బైక్‌ అపహరించి..
ఇదే క్రమంలో 2019 డిసెంబర్‌ 21న జగిత్యాలకు చెందిన నరేష్‌ తన గ్లామర్‌ బైక్‌పై యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చాడు. కొండపైన బైక్‌ పార్కింగ్‌ చేసి దర్శనానికి వెళ్లగా మురళీధర్‌రావు సదరు బైక్‌ను చోరీ చేసి తీసుకెళ్లాడు. నరేష్‌ తిరిగి వచ్చే సరికి బైక్‌ కనిపించకపోవడంతో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ రోజు నుంచి బైక్‌ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వాహనాల తనిఖీల్లో..
యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తా వద్ద గురువారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మురళీధర్‌రావు బైక్‌పై అక్కడికి చేరుకోగానే పోలీసులు విచారించారు. దీంతో అతడు తడబడటంతో అనుమానం వచ్చిన పోలీసులు బైక్‌కు సంబంధించిన పత్రాలను చూపెట్టాలని కోరగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కొండపై ఓ బైక్‌తో పాటు మరో 9బైక్‌లను అపహరించినట్లు అంగీకరించాడు. తన చోరీల ప్రస్థానాన్ని వివరించాడు. తాను ఒక్క బైక్‌ను కూడా విక్రయించలేదని.. సరదా కోసమే చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. 

పది బైకుల స్వాధీనం...
మురళీధర్‌రావు అపహరించిన మొత్తం బైక్‌లను భువనగిరి టౌన్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెర్వు, నిజామాబాద్‌ 4టౌన్‌ పోలీస్‌స్టేషన్లలో ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఆ వాహనాలకు సంబంధించిన యజమానులు కోర్టు ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో యాదగిరిగుట్ట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ పాండురంగారెడ్డి, సీసీఎస్‌ సీఐ పార్థసారథి, ఎస్‌ఐలు గుండెల రాజు, రవీందర్, సిబ్బంది సుందర్‌పాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా