శభాష్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌

13 Aug, 2019 10:32 IST|Sakshi
నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన బైక్‌

సాక్షి, హైదరాబాద్‌‌: విదేశాల నుంచి తెచ్చిన పరికరాలతో నిబంధనలకు విరుద్దంగా బైక్‌ను తయారు చేసి అధిక శబ్ధంతో చెవులు చిల్లులు పడే రీతిలో సైలెన్సర్‌ ఏర్పాటు చేసి దూసుకుపోతున్న స్కూటరిస్టును జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకొని కేసు చేసి బైక్‌ను సీజ్‌ చేసిన ఘటన ఓ ఎన్‌ఆర్‌ఐని విశేషంగా ఆకట్టుకుంది. అమెరికాలోని ఓ చారిటబుల్‌ మెడికల్‌ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్‌ దివాకర్‌రావు కట్టార్‌ ఈ మేరకు పోలీసుల పనితీరు మెచ్చుకుంటూ నగర పోలీసు కమిషనర్‌కు ట్వీట్‌ చేశారు. ఈ నెల 8వ తేదీన ఎంహెచ్‌ 49డబ్ల్యూ4141 బైక్‌పై అధిక శబ్ధంతో ఓ యువకుడు దూసుకుపోతుండగా జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.ముత్తు ఛేజ్‌ చేసి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో పట్టుకున్నారు. ఆరా తీయగా ఆ బైక్‌ను కె.నర్సింహ(23) నడుపుతున్నట్లు తేలింది.

అంతకుముందు ఈ బైక్‌ టోలీచౌకీకి చెందిన సయ్యద్‌ ఎజాజ్‌ హుస్సేన్‌ది కాగా దానికంటే ముందు ఆస్ట్రేలియాకు చెందిన హుస్సేన్‌ పేరుతో ఉన్నట్లు తేలింది. ఎలాంటి పత్రాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నర్సింహ ఈ బైక్‌ను తయారు చేయించాడు. విపరీతమైన శబ్ధంతో సైలెన్సర్‌ ఏర్పాటు చేశారు. నిందితుడిపై సెక్షన్‌ 80 మరియు 190(2) మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం దివాకర్‌రావును విశేషంగా ఆకర్షించింది. తాను హైదరాబాద్‌ రోడ్లపై వెళుతున్నప్పుడు అడ్డదిడ్డంగా వెళుతున్న వాహనాలు సౌండ్‌ పొల్యూషన్‌తో ఇబ్బంది పడ్డానని ట్వీట్‌ చేశారు. శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న ఇలాంటి బైక్‌లను సీజ్‌ చేయాలన్నారు. సౌండ్‌ పొల్యూషన్, రోడ్‌ఫైటింగ్‌ ఇక్కడ ఎక్కువయ్యాయని వీటిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.  (చదవండి: ప్లేటు మారిస్తే.. ఫేట్‌ మారిపోద్ది!)

మరిన్ని వార్తలు