డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌: తాగకున్నా.. తాగినట్టు..!!

2 Jan, 2019 13:03 IST|Sakshi

సాక్షి, కంటోన్మెంట్‌ : న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా ప్రమాదాల నివరణకు సోమవారం అర్ధరాత్రి నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెటన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఇటీవల సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సయ్యద్‌ జహిరూల్లా ఖాద్రి అనే యువకుడు మద్యం తాగకున్న తాగినట్టు బ్రీత్‌ అనలైజర్‌లో రీడిండ్‌ రావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి కూడా అలాంటి ఘటనే జరిగింది. వివరాలు.. ఉప్పల్‌కు చెందిన నాగభూషణ్‌రెడ్డి (32) తాడ్‌బండ్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలాఖరు కావడంతో ఆరోజు ఆఫీసులో ఆలస్యమైంది. అర్ధరాత్రి 12గంటల సమయంలో బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. తాగకున్న తాగినట్టు!)

తాడ్‌బండ్‌ చౌరస్తా సమీపంలో తిరుమలగిరి ట్రాఫిక్‌ పోలీసులు ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’  తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాగభూషణ్‌రెడ్డిని బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షించగా భారీగా మద్యం తాగినట్టు రీడింగ్‌ వచ్చింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి వాహనాన్ని సీజ్‌ చేశారు. ఖంగుతిన్న నాగభూషణ్‌రెడ్డి తాను ఎలాంటి మద్యం సేవించలేదని ట్రాఫిక్‌ సిబ్బందికి చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో బాధితుడు అప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు బాదితుడికి ‘క్లీన్‌ చిట్‌’ ఇస్తూ ఎమ్మెల్సీ నివేదిక ఇచ్చారు. వైద్యులు ఇచ్చిన నివేదిక తీసుకుని నాగభూషణ్‌రెడ్డి మంగళవారం స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు అతని వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయమై తిరుమలగిరి ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ రవిని వివరణ కోరగా.. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో నాగభూషణ్‌రెడ్డి మద్యం సేవించినట్లు నిర్దారణ అయిందనీ ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు