ఏసీబీకి చిక్కిన బిల్‌కలెక్టర్‌

14 Mar, 2018 07:50 IST|Sakshi
విచారణ చేస్తోన్న ఏసీబీ అధికారులు..ఇన్‌సెట్లో పట్టుబడిన బిల్‌ కలెక్టర్‌

నర్సంపేట నగర పంచాయతీలో ఘటన

నిందితుడి ఇంటిలో సోదాలు

నర్సంపేట: ఇంటి యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి నగర పంచాయతీ బిల్‌కలెక్టర్‌ను పట్టుకున్న సంఘటన పట్టణంలో మంగళవారం జరిగింది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ సుదర్శన్‌గౌడ్‌ కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన జడల వెంకటేశ్వర్లు తన స్వయాన సోదరుడు జడల శ్రీనివాస్‌ ఇంటికి సంబంధించిన యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని 2017, డిసెంబర్‌ 22న దరఖాస్తు చేసుకున్నాడు.

ఇంటి ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని బిల్‌కలెక్టర్‌ మురళీ తెలపడంతో వారం రోజుల క్రితం  ఆ డబ్బులను వెంకటేశ్వర్లు ముట్టజెప్పాడు. అయినప్పటికీ ఆలస్యం చేస్తుండటంతో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా మరో రూ.10 వేలు ఇస్తేనే సర్టిఫికెట్‌ ఇస్తానని తెగేసి చెప్పాడు. వెంకటేశ్వర్లు ఎంత బతిమిలాడినా మురళీ అంగీకరించలేదు.

దీంతో మూడు రోజుల క్రితం వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు అతడు రూ.10 వేలను బిల్‌కలెక్టర్‌కు ఇస్తుండగా ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఏసీబీ డీఎస్పీ ముద్దసాని కిరణ్‌కుమార్, సీఐలు సతీష్, పులి వెంకట్, క్రాంతికుమార్‌ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనంతరం మురళీని నగర పంచాయతీకి తరలించి రికార్డులను తనిఖీ చేసి విచారించారు. అక్కడి నుంచి మురళీ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేసి ఆస్తుల వివరాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలను స్వాదీనం చేసుకొని అరెస్ట్‌ చేశారు. బుధవారం పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీడీ వెల్లడించారు. 

బాధ భరించలేక ఏసీబీని ఆశ్రయించా


న్యాయంగా మాకు ఇవ్వాల్సిన ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉచితంగా ఇవ్వకుండా కొన్నిరోజులు తిప్పుకున్న తర్వాత డబ్బులు ముట్టజెబితేనే ఇస్తానని మురళీ అనడంతో గత్యంతరం లేక గతంలో రూ.20 వేలు ఇచ్చాను. అయినప్పటికీ మరో రూ.12 వేలు కావాలని డిమాండ్‌ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించా. రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించా. 

మరిన్ని వార్తలు