కుమార్తె కళ్ల ముందే తల్లి మృత్యువాత

23 Nov, 2019 21:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. బస్సు కోసం వేచి చూస్తున్న వారిపై కారు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. కూతురి కళ్ల ఎదుటే కన్న తల్లి ప్రాణాలు వదిలిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, శనివారం మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుంచి కారు అదుపు తప్పి కింద పడిన ఘటనలో మణికొండకు చెందిన సత్యవేణి (45) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమార్తె ప్రణీత స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. 

(చదవండి : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం)

ఇక ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న కృష్ణమిలాన్‌రావు (27) తలకు, కుడి చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  ఐసీయూలో వైద్యుల చికిత్సలు అందిస్తున్నారు. ఇక అనంతపురానికి చెందిన యువతి కుబ్రా(23) ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆటోడ్రైవర్‌ బాలు నాయక్‌(38)ఎడమ కాలిపాదం పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థోపెడిక్‌ వైద్యులు చికిత్స చేస్తున్నారు. 

కాగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 86, ప్లాట్‌ నెంబర్‌ 530లో నివాసం ఉండే కల్వకుంట్ల కృష్ణ మిలాన్‌ రావు(27) శనివారం మధ్యాహ్నం 1.20 గంటలకు రాయదుర్గం వైపు నుంచి తన వోక్స్‌ వ్యాగన్‌ పోలో కారు(టీఎస్‌09ఈడబ్ల్యూ5665)లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుంచి మైండ్‌ స్పేస్‌ వైపు వస్తున్నారు. వేగంగా ఫ్లై ఓ వర్‌పై వెళ్తున్న  కారు అదుపు తప్పింది. రాకెట్‌ వేగంతో కిందికి దూసుకొచ్చి నిసాన్‌ షోరూమ్‌ ముందున్న చెట్టును ఢీ కొట్టి పల్టీలు కొట్టింది.  ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 105 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. అదే సమయంలో చెట్టు కింద ఆటోస్టాండ్‌ ఉండటం, ఆటోడ్రైవర్లతో పాటు మరో 12 మంది చెట్టుకింద నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్లై ఓవర్‌పై వేగంగా ప్రయాణిస్తున్న కృష్ణ మిలాన్‌ కారు అదుపు తప్పి ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. అదే సమయంలో బస్సు కోసం వేచి ఉన్న సత్యవేణిపై కారు పడటంతో ఆమె తల, ఛాతీ భాగాలు చిధ్రమై పోయాయి. కాలేయం రోడ్డున పడటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది.

మృతురాలు సత్యవేణి కుటుంబానికి జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూడు రోజుల పాటు మూసివేశారు. ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణ, రక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రమాదాల నివారణ, సూచనల కోసం నిపుణులతో కమిటీ వేస్తామని తెలిపారు. అయితే గత ఆరు రోజుల్లో ఈ ఫ్లైఓవర్‌పై ఓవర్‌ స్పీడ్‌ కారణంగా  550 వాహనాలకు చలానాలు జారీ కావడం గమనార్హం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా