ఏ తల్లి కన్న బిడ్డో

10 Oct, 2017 08:26 IST|Sakshi
చెరువులో తేలియాడుతున్న శిశువు మృతదేహం

చెరువులో శిశువు మృతదేహం లభ్యం

ఫిర్యాదులు లేకపోవడంతో చెరువు వద్దే ఖననం

శ్రీకాకుళం, రాజాం సిటీ: స్థానిక నగరపంచాయతీ పరిధిలోని బంగారమ్మ కోనేరులో శిశువు మృతదేహం సోమవారం లభ్యమయింది. నెల రోజుల క్రితం ఈ శిశువు జన్మించి ఉండవచ్చునని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముక్కుపచ్చలారని శిశువు మృతిచెందడం బంగారమ్మ చెరువు పరిసర ప్రాంత ప్రజలతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నవారిని కలచివేసింది. చెరువులో శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. చెరువులోని పసికందు మృతదేహాన్ని బయటకు తీశారు. మగశిశువుగా గుర్తించారు. నెల నుంచి రెండు నెలల వయసు ఉంటుందని అంచనా వేశారు. ఈ శిశువుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు, ఫిర్యాదులు లేకపోవడంతో నగరపంచాయతీ అధికారులకు సమాచారం అందించారు. నగరపంచాయతీ సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని శిశువు మృతదేహాన్ని తీసుకుని చెరువు సమీపంలోనే ఖననం చేశారు.

ఎవరిదీ పాపం
పిల్లలు పుట్టక చాలా మంది గుడులు, గోపురాలు, ఆస్పత్రులు చుట్టూ తిరుగుతుంటే పుట్టిన పండంటి మగబిడ్డను ఇలా చెరువులో పారవేయడం పలువురిని ఆవేదనకు గురిచేసింది. ఈ శిశువును ఎవరో హత్యచేసి ఉంటారా? లేక చేసిన పొరపాటుకు పుట్టిన బిడ్డను ఇలా బలిచేశారా అనేది అనుమానంగా మారింది. ఏది ఏమైనా చెరువు పరిసర ప్రాంతాల నుంచి ఎటువంటి అనుమానాలు వ్యక్తం కాలేదు. కాగా ఈ చెరువు ప్రాంతం రాజాం సంతమార్కెట్‌ పక్కనే ఉండడం మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.

ఏడాదిలో రెండో ఘటన
రాజాంలో ఇటువంటి శిశువుల మృతదేహాలు లభించడం ఏడాది వ్యవధిలో రెండో ఘటన కావడం శోచనీయం. సరిగ్గా ఏడాది క్రితం డోలపేటలోని చెరువులో ఇటువంటి శిశువు మృతదేహమే లభించింది. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. రాజాంలో ఆకతాయిలు అధికంగా తిరగడం, వాహనాలను దగ్ధం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మద్యం సేవించడం, సంతమార్కెట్‌ ప్రాంతంలో విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండడం పట్టణ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇవే కాకుండా రాజాంలో పలు లాడ్జీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నా, పోలీసు పరమైన చర్యలు ఎటువంటివి లేవని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక్క రాజాం పట్టణ ప్రాంతంలోనే కాకుండా బొబ్బిలి రోడ్డులోని తోటపల్లి కాలువ సమీపంలో, శ్రీకాకుళం రోడ్డులోని పొగిరి సమీపంలో, పాలకొండ రోడ్డులోని జీఎంఆర్‌ ఐటీ సమీపంలో ఇటువంటి అసాంఘిక కార్యకాలాపాలు అధికంగా జరుగుతున్నాయని, మృతశిశువులను అధికంగా కాలువల్లో పడేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రాజాం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు