సైట్‌లోనే సీయింగ్‌!

27 Aug, 2018 09:08 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీ కుమార్‌

‘బిట్‌కాయిన్స్‌’ కోసం బోగస్‌ ఖాతాలు

వాటిలోనే రాబడి చూపించిన వైనం

పది కేసుల్లోనే రూ.1.3 కోట్ల వరకు స్వాహా

టాస్క్‌ఫోర్స్‌ను ఆశ్రయించిన మరో 20 మంది

‘బిట్‌ కాయిన్స్‌’ ముఠా చేతిలో మోసపోయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శని–ఆదివారాల్లో ఈ ముఠా చేతిలో దగాపడిన మరో 20 మంది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రమేష్‌ బిట్‌ కాయిన్స్‌ కోసం బోగస్‌ ఖాతాలు తెరిచాడు. వీటిలోనే రాబడి చూపించి జనాలను ఆకర్షించాడు. పెట్టుబడితో పాటు లాభాలు, కమీషన్లను సైతం బోగస్‌ వెబ్‌సైట్‌లో చూపించి బురిడీ కొట్టించాడు. 

సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ నగరంలో అప్పుడప్పుడు మల్టీ లెవల్‌ మార్కెంటింగ్‌ (ఎంఎల్‌ఎం) వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో తొలుత చేరిన వారు భారీగా లాభపడటం... ఆఖరులో చేరిన వారు నష్టపోవడం పరిపాటి. అయితే క్రిప్టో కరెన్సీ పేరుతో, కాయినెక్స్‌ట్రేడింగ్‌.కామ్‌ వెబ్‌సైట్‌ ముసుగులో స్కీ(స్కా)మ్స్‌ నడిపిన రమేష్‌ చేతిలో మాత్రం మొదటి నుంచి ఆఖరి వరకు అందరూ నష్టపోగా, కేవలం అతడితో పాటు ప్రధాన దళారులు నలుగురు మాత్రమే లాభపడ్డారు. పెట్టుబడితో పాటు లాభాలు, కమీషన్లను సైతం బోగస్‌ వెబ్‌సైట్‌లో చూపించడమే దీనికి కారణం. ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయిన మొత్తం రూ.కోట్లల్లో ఉంది. ఈ ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. శని–ఆదివారాల్లో ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో 20 మంది టాస్క్‌ఫోర్స్‌ను ఆశ్రయించారు. వీరిలో కరీంనగర్, మంథని, విశాఖపట్నం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరినీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బోయిన్‌పల్లి ఠాణాకు పంపారు. 

బోగస్‌ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఖాతాలు...
స్కామ్‌కు పథకం రూపొందించిన రమేష్‌ ముంబైకి చెందిన సీబీ ఆన్‌లైన్‌ సంస్థకు రూ.లక్ష చెల్లించడం ద్వారా వారితో కాయినెక్స్‌ట్రేడింగ్‌.కామ్‌ వెబ్‌సైట్‌తో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించాడు. దీని నిర్వహణ కోసం ప్రతి నెలా వారికి రూ.25 వేల చొప్పున చెల్లిస్తున్నాడు. సీబీ సంస్థకు చెందిన సునీల్‌ చౌహాన్, మోహన్‌ ఈ సైట్‌లో ఆకర్షనీయమైన స్కీములు ప్రకటించడంతో పాటు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేక ఖాతా రూపొందించి ఇచ్చే సౌలభ్యం కల్పించారు. బాధితుల నుంచి పెట్టుబడులన్నీ నగదు రూపంలోనే తీసుకున్న రమేష్‌ వాటిని డాలర్లుగా మార్చి క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు నమ్మించాడు. అందుకు అయ్యే ఎక్స్‌ఛేంజ్‌ మొత్తాన్నీ వారి నుంచే వసూలు చేశాడు. ఇన్వెస్టర్‌ పేరుతో తమ వెబ్‌సైట్‌ కేంద్రంలో ఓ ఖాతా తెరుస్తామంటూ చెప్పడంతో పాటు వారికి ఓ ప్రత్యేక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయించేవాడు. వీటి ద్వారా లాగిన్‌ అయిన వారికి తన ఖాతాలో ఉన్న బిట్‌కాయిన్స్, వాటి విలువను చూసుకునే అవకాశం ఉండేది. ఆ వ్యక్తి పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభం, ఎంఎల్‌ఎంలో ఓ వ్యక్తిని చేర్చగా వచ్చిన కమీషన్‌ ఇలా అన్నీ ఇందులోనే చూపిస్తూ కనికట్టు చేశాడు. ఈ కేసులో సీబీ ఆన్‌లైన్‌ సంస్థకు చెందిన సునీల్‌ చౌహాన్, మోహన్‌లను నిందితులుగా చేర్చారు.  

‘భయంకరమైన’ లాభాలంటూ..
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలను ఆకర్షించేందుకు రమేష్‌ 12 వేర్వేరు స్కీములు రూపొందించాడు. వీటికి బేసిక్, స్టాండర్డ్, బ్రాంజ్, సిల్వర్‌ ప్లాన్స్‌తో పాటు గోల్డెన్, ప్లాటినం, రాయల్, ప్రీమియం, డైమండ్, ఇన్ఫినిటీ, ఎక్స్‌పర్ట్, ఎలైట్‌ ట్రేడ్‌ అంటూ పేర్లు పెట్టాడు. ఒక్కో దాంట్లో రోజుకు .4 శాతం నుంచి 10 శాతం వరకు బోనస్‌ వస్తుందని, కనిష్టంగా 134 రోజుల (ఎలైట్‌ ట్రేడ్‌) నుంచి గరిష్టంగా 500 రోజుల్లో (బేసిక్‌ ప్లాన్‌) పెట్టుబడి రెట్టింపు అవుతుందని నమ్మించాడు. ఈ స్కీముల్లో 100 అమెరికన్‌ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడికి ఆస్కారం ఉందంటూ ప్రచారం చేయడంతో పాటు దీనికోసం 10 నిమిషాల నిడివితో ఓ షార్ట్‌ఫిల్మ్‌ కూడా రూపొందించాడు. ఇందులో తొలుత బిట్‌కాయిన్‌ వివరాలు చెబుతూ దానిపై బిల్‌క్లింటన్‌ వరకు పలువురి అభిప్రాయాలను చూపించాడు. ఆపై తన స్కీమ్స్‌ను ప్రచారం చేస్తూ రండి త్వరగా కోటీశ్వరులుకండి అంటూ ఆకర్షించాడు. కస్టమర్లను తీసుకువచ్చిన ప్రధాన దళారులైన సత్తయ్య, వెంకటేష్, హరిగోపాల్, శ్రీనివాస్‌లకు మాత్రం 10 శాతం చొప్పున కమీషన్లు ఇస్తూ వచ్చాడు.  
30 మంది బయటకు వస్తేనే...
ఈ గ్యాంగ్‌ గతేడాది మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 1200 మంది నుంచి రూ.10 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయింది రూ.1.37 కోట్లుగా ఉంది. ఎల్బీనగర్‌కు చెందిన బాల్‌రాజ్‌ రూ.1.89 లక్షలు, బోయిన్‌పల్లికి చెందిన రమేష్‌ గుప్త రూ.33.5 లక్షలు, ఆసిఫ్‌నగర్‌కు చెందిన జగ్గారావు రూ.18.71 లక్షలు, చిక్కడపల్లికి చెందిన అభినవ్‌కుమార్‌ రూ.3.5 లక్షలు, మియాపూర్‌ వాసి కృష్ణ రూ.9.37 లక్షలు, మీర్‌పేటకు చెందిన ప్రభాకర్‌రావు రూ.15.6 లక్షలు, సంగారెడ్డికి చెందిన పూవింత్రన్‌ రూ.21.74 లక్షల చొప్పున మోసపోయారు. శని–ఆదివారాల్లో మరో రూ.కోటికి పైగా నష్టపోయిన 20 మంది టాస్క్‌ఫోర్స్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే రమేష్‌ గ్యాంగ్‌ బాధితులు నేరుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆశ్రయించాలని కోరుతున్నారు. 

స్థలాలు, కార్లు ఖరీదు...
ఈ దందాలో వచ్చిన డబ్బులో భారీగా కమీషన్లు చెల్లించడమేగాక మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని రమేష్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం వైపు మళ్లించాడు. రూ.1.23 కోట్లు వెచ్చించి నాలుగు ప్రాంతాల్లో స్థలాలు ఖరీదు చేశాడు. ఈ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బోయిన్‌పల్లిలోని అతడి  జీఆర్‌ఎం ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంతో పాటు రమేష్, ఇతడి బంధువైన మరో నిందితుడు శ్రీనివాస్‌ తదితరుల నుంచి రూ.29.2 లక్షలు రికవరీ చేశారు. రూ.26.4 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని సైతం రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకుగాను నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణ యించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు, ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, కేఎస్‌ రవిలను కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రత్యేకంగా అభినం దించారు. వీరికి నగదు రివార్డులు ఇవ్వనున్నారు. 

మరిన్ని వార్తలు