అగ్నిప్రమాదంలో బీజేడీ నేత ఆలేఖ్‌ చౌదరి మృతి

30 May, 2020 08:05 IST|Sakshi
బీజేడీ నేత ఆలేఖ్‌ చౌదరి(ఫైల్‌), ప్రమాద దృశ్యం

భువనేశ్వర్‌ : అధికార బీజేడీ నాయకుడు ఆలేఖ్‌ చౌదరి ఇంట్లో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆలేఖ్‌ చౌదరి సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరంపురలోని గుసానినువాగం, పాణిగ్రహి వీధిలో నివాసం ఉంటున్న ఆలేఖ్‌ చౌదరి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన గదిలోని ఏసీ(ఎయిర్‌ కండిషనర్‌)లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆ గదిలో నిద్రిస్తున్న ఆలేఖ్‌ చౌదరికి మెలుకువ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపించేశారు.

అనంతరం తన గదిలో నిద్రిస్తున్న బావమరిది భగవాన్‌ పాత్రో, బంధువు సునీల్‌ బెహరాను కాపాడేందుకు వెళ్లిన ఆయనకి ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, అదే గదిలో పడిపోయారు. ఎంతసేపటికీ ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేసి, అందులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని వైద్య సేవల నిమిత్తం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు.

అయితే అప్పటికే వారు చనిపోయినట్లు సమాచారం. బరంపురం సహకార సమితి మాజీ చైర్మన్‌గా, బీజేడీ గంజాం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. మంచి జనాదరణ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఇదిలా ఉండగా, ఆయన మరణ వార్త విన్న ఎంపీ చంద్రశేఖర సాహు, ఎమ్మెల్యే విక్రమ్‌ పండా ఎంకేసీజీ ఆస్పత్రి చేరుకుని, వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు పాణిగ్రాహి వీధిలో దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంపై అక్కడి ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు. 

అంతిమ వీడ్కోలు.. 
పోస్టుమార్టం అనంతరం ఇంటికి తీసుకువచ్చిన ఆలేఖ్‌ చౌదరి మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. ఈ సందర్భంగా బీజేడీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, బంధువర్గం ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు