ముగిసిన బీజేపీ నేత పోలీసు కస్టడీ

25 Feb, 2019 10:04 IST|Sakshi
జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ నేత ప్రదీప్‌

బంజారాహిల్స్‌: ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్లు (జేఎన్‌ఆర్‌ఎం) ఇప్పిస్తానంటూ అమాయక బస్తీవాసులను నమ్మించి రూ.లక్షలు వసూలు చేసిన జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు మెరుగు ప్రదీప్‌కుమార్‌ పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది. ఈ నెల 13న ప్రదీప్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా చీటింగ్‌ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఈ నెల 22న మరోసారి పోలీసు కస్టడీకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు.

వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2లోని ఇందిరానగర్‌ జవహర్‌నగర్‌కు చెందిన జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌ మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–46లోని  అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పక్కా ఇళ్లను ఇప్పిస్తానంటూ ఇందిరానగర్, జవహర్‌కాలనీ వాసులను నమ్మించాడు. వెంకటేశ్వర హౌసింగ్‌ సొసైటీ పేరుతో లెటర్‌హెడ్స్‌ తయారు చేసి ఇళ్లు మంజూరవుతున్నాయని తనకున్న పరిచయాలతో వాటిని ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల దాకా వసూలు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లను ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు నిలదీయగా తాను రామ్మోహన్‌ అనే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చానని అతను తనను మోసం చేసినట్లు తెలిపాడు. వసూలు చేసిన డబ్బులు ఇస్తానంటూ కాలం వెల్లదీశాడు. మూడేళ్లు గడిచినా ఇళ్లు రాకపోగా డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు 30 మందిని రూ.36 లక్షల మేర మోసం చేశాడంటూ కృష్ణానగర్‌లో ఉంటున్న వెంకట్‌ అనే వ్యక్తి ద్వారా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రదీప్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు