సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

15 Jul, 2019 11:02 IST|Sakshi

బీజేపీ ఎమ్మెల్యే  కూతురు  సాక్షి మిశ్రా  కేసులో సంచలన ట్విస్ట్‌

కోర్టు ఆవరణలోనే యువ  జంట కిడ్నాప్‌నకు యత్నం, దాడి

దళిత వ్యక్తితో  కులాంతర వివాహం  చేసుకున్న సాక్షి

రక్షణ  కల్పించాలని మీడియా సాక్షిగా ఆవేదన

ఉత్తరప్రదేశ్‌  బీజేపీ నేత కూతురు సాక్షి మిశ్రా కులాంతర వివాహం విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తను భర్త అజితేష్ కుమార్‌ ప్రాణానికి ప్రమాదం ఉందంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న సాక్షి మిశ్రాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టు గుమ్మం తొక్కిన  ఈ జంటను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారన్న వార్త కలకలం రేపింది.  

అలహాబాద్ హై కోర్టులో బరేలీకి చెందిన సాక్షి దంపతులు దాఖలు చేసిన  పిటిషన్‌ సోమవారం  విచారణకు రానుంది. దీంతో యువ జంట కోర్టు గేట్ నంబర్ 3 వెలుపల వేచి వుండగా బ్లాక్‌ ఎస్‌యూవీలో వచ్చి కొంతమంది సాయుధ వ్యక్తులు తుపాకీ గురిపెట్టి మరీ అపహరించుకు పోయారని మొదట నివేదికలు వెలువడ్డాయి.  ఉదయం 8.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం యూపీ 80 అనే రిజిస్ట్రేషన్ నంబర్‌గల ఎస్‌యూవీ వెనుక  ‘ఛైర్మన్’ రాసి ఉంది. సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నామని, వాహనాల తనిఖీ ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. స్పెషల్ పోలీస్ సూపరింటెండెంట్ బరేలీ మునిరాజ్ మాట్లాడుతూ, ఈ దంపతులు ప్రస్తుతం ఎక్కడున్నదీ తమ వద్ద సమాచారం లేదనీ, ఆచూకీ గురించి  తెలియజేస్తే, వారికి భద్రత కల్పిస్తామని  చెప్పారు.  అయితే  తమను కిడ్నాప్‌ చేయడానికి కొంతమంది ప్రయత్నించారని సాక్షి దంపతులు ఆరోపించారు. కిడ్నాప్‌ను ప్రతిఘటించిన తామిద్దరిపైనా  తీవ్రంగా  దాడి చేశారన్నారు.

మరోవైపు వీరిద్దరి వివాహానికి సహాయం చేసిన వారి స్నేహితులలో ఒకర్ని 2018లో ఒక కేసుకు సంబంధించి అరెస్టు చేయడం గమనార్హం. ఇతను ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా తండ్రికి సన్నిహితుడని చెబుతున్నారు. అటు అజితేష్ కుమార్ తండ్రి హరీష్ కుమార్ తమ కొడుకు కోడలి ఆచూకీ తెలియదనీ, వారి ప్రాణాలకు ముప్పు వస్తుందనే భయంతో కుటుంబంతో సహా తాను బరేలీని విడిచి దూరంగా వెళ్లిపోయామని వాపోయారు.

వారి వివాహం చట్టబద్ధమైందే- కోర్టు
ఇదిఇలా వుంటే సాక్షి అజితేష్‌  వివాహాన్ని చట్టబద్దమైందిగా అలహాబాద్‌ హైకోర్టు ప్రకటించింది. అలాగే వారికి తగిన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి  ప్రయత్నాలు చేసిందని  ప్రశ్నించింది.  తాజా ఘటనపై  అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై స్పందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. 

కాగా దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు, తన తండ్రి ద్వారా తమకు ప్రాణహాని వుందని, ఇప్పటికే అనేక బెదిరింపులు ఎదురయ్యాయంటూ సాక్షి మిశ్రా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భర్త అజితేష్‌తో కలిసి ఆమె సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియో అప్‌లోడ్‌ చేశారు. తమకు సహాయం చేయాల్సిందిగా మీడియా, పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. 

చదవండి : మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు : ఎమ్మెల్యే కూతురు

మరిన్ని వార్తలు