మోదీ సభలో పోలీసును చితకబాదారు

17 Jul, 2018 21:09 IST|Sakshi

మిడ్నాపూర్‌/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీ’లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు శృతిమించి ప్రవర్తించారు. బందోబస్త్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లపై దాడికి యత్నించారు. ర్యాలీ లోకి తమను అనుమితించటంలేదని ఆవేశంతో కర్రలు, రాళ్లతో విరుచుకపడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి, సుమారు 15 మంది వాలంటీర్లు గాయపడ్డారని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారు పార్టీ వాహనాల్లో పరారయ్యారని అధికారులు తెలిపారు. అరెస్టైన వారి నుంచి మిగతావారి వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. ఈ ఘటనను స్వపక్ష, విపక్ష సభ్యులు ఖండించారు.  

ఇలాంటివి మా పార్టీ ప్రోత్సహించదు..
వాలంటీర్లు, పోలీసు అధికారిపై దాడి ఎంతగానో బాధించిందని.. ఇలాంటి చర్యలను తమ పార్టీ ప్రోత్సహించదని పశ్చిమబెంగాల్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ పేర్కొన్నారు. మోదీ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారని, ఆ ఆవేశంలో ఇలా చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వేలాది ప్రజలు పాల్గొన్న ఈ ర్యాలీని పోలీసులు ప్రశాంతంగా వ్యవహరించి విజయవంతం చేశారని, వారికి కృతఙ్ఞతలు తెలిపుతున్నట్లు ఘోష్‌ తెలిపారు. 

రాష్ట్రంలో మోదీ అశాంతి వాతావరణం సృష్టించారు..
మోదీ నిర్వహించిన కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీతో రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొందని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అజిత్‌ మేటీ మండిపడ్డారు. జార్ఖండ్‌, ఒడిశా నుంచి జనాలను రప్పించి రాష్ట్రంలో గొడవలు సృష్టించారని ఆరోపించారు. వాలంటీర్లు, పోలీసులపై దాడిని తీవ్రంగా ఖండించారు. 

మరిన్ని వార్తలు