ఆలయంలో బీజేపీ నేత చెప్పుతో దాడి

9 Mar, 2018 17:08 IST|Sakshi

సాక్షి, చెన్నై : బీజేపీకి చెందిన మహిళా నేత ఒకరు ఆలయంలో అనుచితంగా ప్రవర్తించారు. కరపత్రాలను పంచుతున్న కొంతమంది రైతులపైనా, వారి నాయకుడిపైనా చెప్పుతో దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కారు. పైగా ఆమె దాడి చేయడమే కాకుండా తనకు ఇబ్బంది కలిగించిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ చిర్రుబుర్రులాడారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోగల ఆలయానికి నెళ్లయమ్మాల్‌ అనే ఆ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వచ్చారు. అదే సమయంలో కొంతమంది రైతుల అసోసియేషన్‌ అదే ఆలయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారు.

జన్యుపరమైన మార్పులు చేసే వ్యవసాయాన్ని కేంద్రం ఆధరించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ కరపత్రాలు ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నెళ్లయమ్మాల్‌ వారితో వాగ్వాదానికి దిగారు. వారిపై దుర్భాషలాడారు. ఆ రైతులంతా కూడా పెద్ద వయసులో ఉన్నారని కూడా చూడకుండా తన చెప్పును తీసుకొని వారిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. మున్ముందు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటావని కూడా ఆమె ఆ రైతు నాయకుడిని బెదిరించారు. అయితే, ఆ రైతులపై కేసులు నమోదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర విభాగం చెప్పింది. రైతుల అసోసియేషన్‌ అధ్యక్షుడు అయ్యకన్ను ఆమెను వ్యభిచారి అంటూ దుర్భాషలాడారని, అందుకే అక్కడ పరిణామాలు చోటు కేసుకున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు