ఠాణాలోనే బావ గొంతు కోశాడు

14 Jan, 2020 07:16 IST|Sakshi

తీవ్ర రక్తస్రావం.. పరిస్థితి విషమం

చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఘటన

చివ్వెంల/సూర్యాపేట క్రైం: కుటుంబ తగాదా కేసులో కౌన్సెలింగ్‌ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బావపై బావమరిది దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మండల పరిధిలోని జగన్నాయక్‌ తండాకు చెందిన రమావత్‌ దేవేందర్, శ్వేత దంపతులు. రెండు నెలల క్రితం భర్తతో గొడవ పడిన శ్వేత.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భగత్‌సింగ్‌ నగర్‌లో ఉంటున్న శ్వేత వద్దకు వచ్చిన దేవేందర్, పెద్దలకు నచ్చజెప్పి ఆమెను జగన్నాయక్‌ తండాకు తీసుకెళ్లాడు. కాగా, ఆదివారం సాయంత్రం మళ్లీ భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు.

దీంతో శ్వేత డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. పోలీసులు వచ్చి ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత శ్వేతను బంధువులు వచ్చి తిరిగి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం వారు దేవేందర్‌పై  ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు దేవేందర్‌ను కౌన్సెలింగ్‌ కోసం స్టేషన్‌కు రమ్మనడంతో వచ్చాడు. ఆ సమయంలో ఎస్‌ఐ, సిబ్బందితో కలసి తనిఖీల నిమిత్తం బయటకు వెళ్లారు. స్టేషన్‌లో ఉన్న శ్వేత, దేవేందర్‌ల కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు.  ఈ సందర్భంగా దేవేందర్‌పై అతని బావమరిది రఘురాం దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు దేవేందర్‌ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవేందర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు