హడలెత్తిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌

30 Apr, 2018 13:25 IST|Sakshi
బ్లేడ్‌ బ్యాచ్‌ దాడిలో గాయాల పాలైన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సాదరాజు గుట్ట ప్రాంతవాసులు (పైల్డ్‌)

బెంబేలెత్తిస్తున్న దారి దోపిడీలు

కొరవడిన పోలీసుల నిఘా  

బ్లేడ్‌ బ్యాచ్‌లు రాజమహేంద్రవరంలో విజృంభిస్తున్నాయి. నగరంలో మూడేళ్లుగా ఈ బ్యాచ్‌ల సంచారం ఉన్నప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో అవి రెచ్చిపోతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్నవారిపై దాడి చేసి బంగారు వస్తువులు, నగదు అపహరిస్తున్నారు.

రాజమహేంద్రవరం క్రైం:రోడ్డుపై వెళ్తున్నవారిపై బ్లేడ్‌తో తాడి చేసి వారి వద్ద ఉన్న నగదు, నగలు, ఇతర వస్తువులను దోచుకొనే బ్లేడ్‌ బ్యాచ్‌లు నగరంలో కలకలం సృష్టిస్తున్నాయి.  గంజాయి, మద్యం సేవించిన యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌గా ఏర్పడి దాడులకు పాల్పడి దోపిడీ చేస్తున్నారు.   రాజమహేంద్రవరంలోని గోదావరి రైల్వే స్టేషన్, అండర్‌ గ్రౌండ్, సుబ్రహ్మణ్యం మైదానం రోడ్డు, ఆనం కళా కేంద్రం వెనుక వైపు ఉన్న రోడ్డు, గోకవరం బస్టాండ్, నాగదేవి ఎదురుగా ఉన్న రోడ్లు, క్వారీ మార్కెట్, రాజేంద్ర నగర్, ఏవీ అప్పారావు రోడ్డు  తదితర నిర్మానుష్య ప్రాంతాల్లో బ్లేడ్‌ బ్యాచ్‌లు దాడులకు పాల్పడుతున్నాయి. రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు చొప్పున వచ్చి రాత్రి సమయాల్లో ట్రైను, బస్సులు దిగి వెళ్తున్న వారిని బెదిరించి వారి జేబుల్లో ఉన్న నగదు, వంటిపై ఉన్న వస్తువులు చోరీ చేస్తున్నారు. ఆనం కళా కేంద్రం, దామెర్ల రామారావు ఆర్ట్స్‌ గ్యాలరీ రోడ్లలో నిత్యం రైల్వే స్టేషన్‌లో దిగి వెళ్తున్న వారికి ఈ అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎదురు తిరిగిన వారిని బ్లేడ్‌ చూపించి బెదిరించి వారిని దోచుకుంటున్నారు.

నిఘా కొరవడినందువల్లే..
పోలీసుల నిఘా కొరవడినందువల్లే నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. గతంలో రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో  ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక వాహనం ఉండేది. ఆ వాహనం నిర్వహణ, ఆయిల్‌ ఖర్చులు భారంగా మారడంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో యాంటీ గూడా స్వా్కడ్‌ పేరుతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం మొత్తం ఈ టీమ్‌తోనే పర్యవేక్షణ చేయడంతో రాత్రిపూట గస్తీ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిలో గామన్‌ ఇండియా బ్రిడ్జి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేశారు. గతంలో  పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సాదరాజు గుట్ట ప్రాంతానికి చెందిన కాగిత సత్యనారాయణ తన కుమారుడుకి బదిలీ కావడంతో విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి ఇంటి సామగ్రిని టాటా ఏస్‌ వ్యాన్‌లో తీసుకువెళ్తుండగా బ్లేడ్‌ బ్యాచ్‌ కు చెందిన 8 మంది యువకులు దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, రూ.7 వేల నగదు, టాటా ఏస్‌ వ్యాన్‌తో పాటు ఇంటి సామగ్రిని దోచుకున్నారు.

ఉక్కుపాదంతోఅణచి వేయాలి
పోలీసుల వద్ద బ్లేడ్‌ బ్యాచ్‌స గురించి సమగ్రమైన సమాచారం ఉంది. అయినప్పటికీ పోలీసులు ఉదాసీన వై ఖరి అవలంబించడంతో వారి ఆటలు సాగుతున్నాయి. బ్లేడ్‌ బ్యాచ్‌ వెనుక పెద్దల హస్తం ఉండడంతో పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పటికైనా పోలీసులు కళ్లు తెరిచి వీరిని అరికట్టకపోతే నగరంలో మరిన్ని దారుణాలు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు