బ్లూ ఫ్రాగ్‌ ఎండీ సెల్‌ఫోన్లు స్వాధీనం

16 Nov, 2019 03:25 IST|Sakshi

శుక్రవారం కూడా కొనసాగిన సోదాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. శుక్రవారం కూడా సీఐడీ అధికారులు బ్లూ ఫ్రాగ్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సంస్థ ఎండీ ఫణికుమార్‌రాజ్‌ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

మొబైల్స్‌లోని ఫోన్‌ కాల్స్‌ డేటా విశ్లేషణ కోసం అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి పంపారు. ఫణితో పాటు టెక్నికల్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. బ్లూ ఫ్రాగ్‌లో సీజ్‌ చేసిన సర్వర్ల సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించేందుకు రెండు సైబర్‌ క్రైం బృందాలను నియమించారు. ఏ ఐపీ అడ్రస్‌లతో బ్లూ ఫ్రాగ్‌ కార్యకలాపాలు నిర్వహించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సాక్ష్యాధారాలు సేకరించాం 
ప్రభుత్వ వెబ్‌సైట్‌ను బ్లూ ఫ్రాగ్‌ బ్లాక్‌ చేసి ఇసుక కృత్రిమ కొరత సృష్టించిందనే ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేశాం. కొన్ని ప్రాధమిక సాక్ష్యాధారాలు సేకరించాం. వాటిని సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషించి నిర్ధారణ చేసుకుంటాం. రెండు మూడురోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది.– సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ

మరిన్ని వార్తలు