బోధ్‌ గయ పేలుళ్లకు హైదరాబాద్‌లోనే కుట్ర!

29 Jan, 2019 10:13 IST|Sakshi

 సుదీర్ఘకాలం ఇక్కడే తలదాచుకున్న ఉగ్రవాది కౌసర్‌

2017 నవంబర్‌లో వచ్చి కలిసిన మరో ముగ్గురు

మారేడ్‌పల్లిలోని డెన్‌లోనే పేలుళ్లకు పథకం  

సూత్రధారి విచారణలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం

సాక్షి, సిటీబ్యూరో: బీహార్‌లోని బోధ్‌ గయలో ఏడాది క్రితం చోటు చేసుకున్న మూడు పేలుళ్లకు కుట్ర హైదరాబాద్‌ నుంచే జరిగిందా..? ఔననే అంటున్నారు దర్యాప్తు అధికారులు. అప్పట్లో మారేడ్‌పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్‌ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అందులోనే హైదరాబాద్‌ ప్రస్తావన తీసుకువచ్చింది. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థ భావించింది. బౌద్ధుల ప్రార్థన స్థలాలను టార్గెట్‌ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో పాటు తమ ప్రతీకారం తీర్చుకోవాలని వీరు భావించారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ జహీదుల్‌ ఇస్లాం అలియాస్‌ కౌసర్‌ జేఎంబీలో కీలకపాత్ర పోషించారు. ఆ సంస్థ తరఫున బంగ్లాదేశ్‌లో అనేక పేలుళ్లకు పాల్పడటంతో కొన్నేళ్ల క్రితం అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. రెండేళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకున్న ఇతను పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మీదుగా భారత్‌లోకి చేరుకున్నాడు.

అనేక ప్రాంతాల్లో తలదాచుకున్న అనంతరం చెన్నైతో పాటు హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలోనూ కొన్నాళ్లు వ్యాపారిగా షెల్టర్‌ తీసుకున్నాడు. అక్కడ ఉండగానే బీహార్‌లోని బోధ్‌గయను టార్గెట్‌గా ఎంచుకున్నాడు. దీనిపై తనకు జేఎంబీ కేడర్‌కు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించిన దిల్వార్‌ హోస్సేన్‌కు సమాచారం ఇచ్చాడు. రెండు రోజులకే మారేడ్‌పల్లికి వచ్చిన హోస్సేన్‌ నేరుగా వెళ్లి కౌసర్‌ను కలిశాడు. వీరిద్దరూ చర్చించిన తర్వాత బోధ్‌గయలోనే పేలుళ్లకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తమ అనుచరులైన ఆదిల్‌ షేక్, అబ్దుల్‌ కరీం, రెహ్మాన్, ఆరిఫ్‌లకు తెలిపి హైదరాబాద్‌ రప్పించారు. నవంబర్‌ 20న సిటీకి వచ్చిన వీరు డిసెంబర్‌ 15 వరకు ఇక్కడే ఉన్నారు. ఆ మధ్య కాలంలోనే కుట్రను పూర్తి చేసిన కౌసర్‌ పేలుడు పదార్థాల సమీకరణ, రెక్కీ నిర్వహించడం, బాంబులు తయారు చేయడం, వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చడం వంటి బాధ్యతలు అప్పగించాడు. డిసెంబర్‌ 16న కౌసర్, హోస్సేన్‌ చెన్నైకు మిగిలిన వారు పట్నాకు వెళ్లిపోయారు. పథకం ప్రకారం ఈ ఉగ్రవాదులు గత ఏడాది జనవరి 19న బోధ్‌గయలోని మూడు చోట్ల తక్కువ తీవ్రతగల బాంబులను  అమర్చారు. వీటిలో ఒకటి పేలగా... మరో రెండింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో నిందితును అరెస్టు చేసింది. వీరి విచారణలోనే సిటీ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తులో భాగంగా గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చి ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది. 

మరిన్ని వార్తలు