అదృశ్యమై.. హీరో ఫాంహౌస్‌లో అస్థిపంజరంలా తేలాడు

20 Sep, 2019 12:10 IST|Sakshi
అస్థిపంజరాన్ని తీసుకెళ్తున్న కుటుంబసభ్యులు

సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి

నాలుగేళ్ల తర్వాత శవమై లభ్యం

మృతుడు పాపిరెడ్డిగూడకు చెందిన పాండుగా గుర్తించిన కుటుంబసభ్యులు

అన్నంటే అతడికి ప్రాణం.. ఒకరినొకరు విడిచి క్షణమైనా ఉండే వారు కాదు.. రక్తం పంచుకొని పుట్టిన అన్న అనారోగ్యానికి గురై మృతిచెందాడు.. అన్న లేని జీవితం వ్యర్థమని.. తాను కూడా ఇక తనువు చాలిస్తానంటూ లేఖ రాసి పెట్టిన ఓ యువకుడు.. నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. బుధవారం అస్థి పంజరమై కనిపించాడు. ఈ సంఘటన కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో చోటుచేసుకుంది. 

సాక్షి, కేశంపేట (షాద్‌నగర్‌): నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి బుధవారం అస్థిపంజరమై కనిపించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలంలోని పాపిరెడ్డిగూడలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, అంజమ్మ దంపతులకు హన్మంత్, రాజు, కుమార్, పాండు నలుగురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు పాండు (32) నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీరికి ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్ల గ్రామ శివారులో కొంత వ్యవసాయ పొలం ఉంది.

కుమార్, పాండు మధ్య అనుబంధం విడదీయలేనిది. అయితే నాలున్నరేళ్ల కిందట కుమార్‌కు వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబం తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పాండు తన అన్న మృతితో కుంగిపోయాడు. కుమార్‌ వైద్యం కోసం కుటుంబసభ్యులు ఉన్న భూమిని అమ్మేశాడు. ఆ అప్పును చిన్న కుమారుడు పాండు తరచూ కుటుంబసభ్యులతో చెప్పేవాడు. అయితే అప్పులు ఎంతకీ తీరే మార్గం కనిపించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు తమ భూమిని అమ్మేశారు. ప్రాణంగా ఇష్టపడే అన్న మృతిచెందడం.. ఇటు తనకు ఇష్టమైన వ్యవసాయ భూమిని విక్రయించడాన్ని తట్టుకోలేకపోయిన పాండు తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు. అమ్మంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెను బాగా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అన్న కుమార్‌ పెళ్లి సందర్భంగా తనకు తెచ్చిన దుస్తులు వేసి అంతిమసంస్కారాలు జరిపించాలని లేఖలో కోరాడు. 

నాలుగేళ్ల క్రితం పాండు రాసిన సూసైడ్‌ నోట్‌ 

నాగార్జున ఫాంహౌస్‌లో అస్థిపంజరం..  
నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమైపోయిన పాండు హీరో నాగార్జున పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో కొనుగోలు చేసిన ఫాంహౌస్‌లోని ఓ భవనంలో అస్థిపంజరమై కనిపించాడు. అయితే పాండుకు సంబంధించిన వ్యవసాయం పొలం పక్కనే నాగార్జున ఫాంహౌస్‌ ఉండడం, దీనికి చివరలో ఓ పాత భవనం ఉండడంతో అక్కడకు ఎవరూ వెళ్లేవారు కాదు. లేఖ రాసి పెట్టిన పాండు నేరుగా ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ 
శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐలు రామకృష్ణ, చంద్రబాబు, కేశంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్‌కార్డులు, ఐడీ కార్డులు, చెప్పులు, ఇయర్‌ఫోన్లు, ఒక జత దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు పాపిరెడ్డిగూడకు చెందిన పాండుగా గుర్తించారు. ఇతను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్వో మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు