తప్పని ఎదురుచూపులు..

20 Sep, 2019 10:35 IST|Sakshi
కారుకూరి రమ్య (ఫైల్‌)

కడసారి చూపు కోసమే నిరీక్షణ

రమ్య గల్లంతై నేటికి ఆరు రోజులు

ప్రమాదస్థలిలో తండ్రి... ఇంట్లో తల్లి...

సాక్షి, మంచిర్యాల(హాజీపూర్‌): చిన్ననాటి నుంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించిన కన్నపేగు ఇన్నాళ్లు తమ మధ్య ఉంటూ నిత్యం నవ్వులతో ఆనందంగా ఉండే కన్నబిడ్డ జాడ కరువయ్యింది. మొన్నటి వరకు సంతోషాల మధ్య సాగిన ఆ కుటుంబంలో అంతుచిక్కని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే... హాజీపూర్‌ మండలంలోని నంనూర్‌ గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్‌–భూలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె రమ్య(23), కుమారుడు రఘు ఉన్నారు.

సుదర్శన్‌ విద్యుత్‌ శాఖలో సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇక కుమార్తె రమ్య బీటెక్‌ పూర్తి చేసి కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సబ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం మొదటి నెల జీతం కూడా తీసుకుంది. విధుల నిమిత్తం వరంగల్‌ వెళ్లి అక్కడి నుంచి పాపికొండలు విహార యాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ విహార యాత్రలో భాగంగా 15వ తేదీ ఆదివారం పాపికొండలు గోదావరిలో పడవ మునిగి అంతా గల్లంతయ్యారు. నాటి నుంచి రమ్య ఆచూకీ మాత్రం లభించలేదు.

రోజు రోజుకూ గోదావరిలో లభిస్తున్న మృతదేహాల్లో తమ రమ్య మృతదేహం ఉందేమోనని ఆందోళన ఒకవైపు... రమ్య ఆచూకీ తెలియడం లేదని మరోవైపు రమ్య తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నేటికి ఆరు రోజులైనా కన్నబిడ్డ జాడ లేదు సరికదా ఏం జరిగిందోనని అంతుచిక్కని ఆవేదనలో పెడుతున్న కన్నీరు మున్నీరు అవుతున్న వారి తీవ్ర ఆవేదన ప్రతీ ఒక్కరిని కలిచివేస్తుంది. ఏది ఏమైనా రమ్య ఆచూకీ గురువారం రాత్రి వరకు తెలియరాలేదు. ఇంకా దాదాపు పది మంది వరకు గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.  రమ్య గల్లంతు ఇంత వరకు తెలియక పోవడంతో ఇటు నంనూర్‌లో తల్లి భూలక్ష్మి తీవ్ర ఆవేదనలో ఉండగా సంఘటనా స్థలంలో తండ్రి సుదర్శన్, సోదరుడు రఘులు దయనీయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా గల్లంతైన రమ్య ఆచూకీ త్వరగా లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా