పేలిన బాయిలర్‌

5 Dec, 2019 13:23 IST|Sakshi
పేలిన ప్రధానమైన బాయిలర్‌ ఇదే

పలాస జీడి పరిశ్రమలో భారీ పేలుడు  

ప్రాణాపాయ స్థితిలో బాయిలర్‌ ఆపరేటర్‌   

ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా పరిశ్రమల అధికారి   

కాశీబుగ్గ: దివాన్‌ జీడి పరిశ్రమలో బాయిలర్‌ పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేటర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ అనంతపురం రెవెన్యూ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిశ్రమ యజమాని తాళాసు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల సమయంలో ఆపరేటర్‌ పల్లెటి ఢిల్లేశ్వరరావు బాయిలర్‌ను ఆన్‌ చేశారు. నాలుగు బస్తాల (320 కేజీల) జీడి పిక్కలను బాయిలర్‌లో వేశారు. వెంటనే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆపరేటర్‌ చిక్కుకున్నాడు. కళ్లల్లోకి కెమికల్‌తో కూడిన ఉష్ణం తగలడంతో  చూపుపోయే పరిస్థితి నెలకొంది. చెతులు కాలిపోయాయి. కాలుకు తీవ్రగాయమైంది. ఢిల్లేశ్వరరావు కేకలు వేయడం స్థానికంగా ఉన్న మహిళలు బయటకు తీసుకువచ్చారు. వెంటనే పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కళ్లు, ఎముకల డాక్టర్లు వైద్యం అందించారు. పదిహేను రోజులు దాటితే కాని పరిస్థితి చెప్పలేమన్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు, జిల్లా పరిశ్రమల తనిఖీ అధికారి చిన్నారావు పరిశీలించారు. ప్రమాద తీరును స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. 

100 మీటర్ల దూరంలో ఎగిరిపడిన పైపు..
బాయిలర్‌ పేలుడు ధాటికి గొడలతోపాటు యంత్రం విడిభాగాలు పగిలిపోయాయి. పరిశ్రమ కాలుష్యాన్ని బయటకు పంపే పైపు సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న మరో జీడి పరిశ్రమ రక్షణ గొడపై పడింది. ప్రతి రోజు 30 మందికి పైగా కూలీలు పనిచేయనున్నారు. ఉదయం సమయంలో ప్రమాద జరగడంతో పెను ప్రమాదం తప్పింది.  

బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ..
సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడు ఢిల్లీశ్వరరావును కలిసి పరామర్శించారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, ఇండస్ట్రీయల్‌ ప్రాంతం అధ్యక్షుడు మల్లా రామేశ్వరం తదితరులున్నారు. 

పేద కుటుంబానికి పెద్ద కష్టం..
దివాన్‌ కాష్యూ ఇండస్ట్రీలో 13 ఏళ్లుగా ఢిల్లేశ్వరరావు కుటుంబం పనిచేస్తుంది. స్వగ్రామం మొగిలిపాడు నుంచి పొట్టకూటి కోసం వచ్చారు. పరిశ్రమలోని చిన్న గదిలో ఉంటున్నారు. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు క్యాన్సర్‌ బారినపడి ఐదేల్ల కిత్రం మృతి చెందాడు. పెద్ద కుమారుడు అనీల్‌కుమార్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. భార్య పార్వతీ ఇదే పరిశ్రమలో పిక్కలు వలిచే పని చేస్తోంది. పరిశ్రమకు నైట్‌ వాచ్‌మేన్, గేట్‌మేన్‌గా కూడా ఈ కుటుంబ సభ్యులే ఉంటున్నారు. 

మరిన్ని వార్తలు