ఉలిక్కిపడిన చిత్తూరు 

24 Jun, 2019 10:20 IST|Sakshi

చిత్తూరు రూరల్‌ మండలంలోని చెర్లోపల్లెలో ఆదివారం నాటు బాంబు పేలడం కలకలం రేపుతోంది. అసలు బాంబుల సంస్కృతికి చిత్తూరుకు సంబంధం లేకపోవడమే ఇందుకు కారణం. కేవలం రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన నాటుబాంబు తయారీ చిత్తూరుకు పాకడం ఇక్కడ నిఘా విభాగాల పనితీరును ప్రశ్నిస్తోంది. 

సాక్షి, చిత్తూరు : చిత్తూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఆదివారం నాటుబాంబు పేలి సుధాకర్‌(35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ మల్లికార్జున, డీఎస్పీ రామాంజనేయులు, తహసీల్దార్‌ చంద్రశేఖర్, తాలూకా సీఐ శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి గల కారణాలపై ఆరా తీశారు. సంఘటన స్థలంలో బాంబుకు చుట్టే తాళ్లు లభ్యం కావడంతో నాటుబాంబు ద్వారానే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

అనుమానాలు ఎన్నో.. 
మృతి చెందిన సుధాకర్‌ తండ్రి కుమారస్వామి చిత్తూరు నగరంలోని బజారువీధిలో నాటు మందులు, ఆయుర్వేదిక్‌ మందులు అమ్మేవాడు. కొన్నేళ్ల కిందట ఆయన మరణించాడు. దీంతో కొంతకాలం సుధాకర్‌ షాపును నిర్వహిస్తూ వచ్చాడు. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఆరేళ్ల కిందట షాపును అమ్మకానికి పెట్టాడు. భార్య గుణసుందరి డ్వాక్రా గ్రూపులో రుణం తీసుకుని ఇంట్లోనే చిల్లరదుకాణం, బట్టలు షాపు పెట్టి కుటుంబానికి కొంత సాయపడుతూ వచ్చింది. అయినా ఆర్థిక కష్టాలు తొలగకపోవడంతో నాటుబాంబు తయారు చేసి క్వారీ, బండరాళ్లు కొట్టేందుకు సరఫరా చేసే పనిని ఇటీవల ప్రారంభినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాంబు పేలి మృతి చెంది ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో అధికారులు, పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. 

శోకసంద్రంలో..
ఓ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో గ్రామస్తులు, బంధువులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు దేవుడా.. మాకెందుకు ఈ శిక్ష అంటూ రోదించడం చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.  జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమ, క్వారీలు బాగా పేరొందాయి. ఇక్కడి కొండల్లోంచి వచ్చే గ్రానైట్, క్వారీలకు పేలుడు పదార్థాలు తప్పనిసరి. అయితే ఇవి నిర్ణీత మొత్తంలో పోలీసుల అనుమతితో మాత్రమే తీసుకురావాలి. కొండల్ని పగులగొట్టేటప్పుడు జిలెటిన్‌ స్టిక్స్‌ రూపంలో వాటిని పేల్చి వేరు చేస్తుంటారు. ఇలాంటి తరుణంలో చెర్లోపల్లెలోని ఓ ఇంట్లో నాటుబాంబు పేలి వ్యక్తి మృత్యువాత పడటం సంచలనంగా మారింది. నాటుబాంబులు సీమలోని కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకే పరిమితం. కానీ చిత్తూరులో జరిగిన పేలుడు ఘటనలో నాటుబాంబులతో పాటు జిలెటిన్‌ స్టిక్స్‌ తయారీకి ఉపయోగించే పెల్లెట్స్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

బడుగులే సమిధలు..  
క్వారీ పరిశ్రమల్లో పేలుడు పదార్థాలు ఉపయోగించడం తప్పనిసరి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు క్వారీ యజమానులు బాంబుల తయారీ కోసం పలు గ్రామాల్లో పేదలను ఎంచుకుంటున్నారు. వీరు క్వారీల నిర్వాహకులు ఇచ్చే అడ్వాన్సులతో నకిలీ జిలెటిన్‌ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తయారుచేసి ఇస్తున్నారు. చిత్తూరులో జరిగిన పేలుడు వెనుక తమిళనాడులోని గుడియాత్తం, పరదరామి ప్రాంతాల నుంచి నల్లమందు, ఇతర పేలుడు పదార్థాలు తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో నగరి, పెనుమూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో క్వారీలను చేజిక్కించుకున్న టీడీపీ నేతలు అనధికారికంగా బడుగు బలహీన వర్గాలకు డబ్బు ఆశ చూపించి నల్లమందు, ఇతర పేలుడు పదార్థాలను తీసుకొచ్చి రహస్యంగా క్వారీలను పేల్చడానికి నాటు బాంబులు తయారు చేసేవారు. కొన్నిసార్లు ఈ పేలుళ్ల ధాటికి మహిళలకు గర్భస్రావాలవడం, పేదల ఇళ్లు ధ్వంసం కావడం లాంటి ఘటనలు గంగాధరనెల్లూరు, నగరి ప్రాంతాల్లో వెలుగు చూశాయి. 

నిఘా అవసరం..
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా చేయాలనే సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే క్వారీలపై పోలీసుల నిఘా ఉండాల్సిందే. అసలు కొండల్ని పేల్చడానికి ఎక్కడి నుంచి జిలెటిన్‌ స్టిక్స్‌ తీసుకొస్తున్నారు..? ఎంత మొత్తం తెస్తున్నారు..? వీటిని ఎక్కడ నిల్వ ఉంచుతున్నారు..? కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారా..? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. 

>
మరిన్ని వార్తలు