మసీదులో బాంబు పేలుడు; 28 మంది మృతి

18 Oct, 2019 19:06 IST|Sakshi

కాబూల్‌ : ప్రార్ధనలకు వెళ్లేవారే లక్ష్యంగా శుక్రవారం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌ హస్కా మినా జిల్లాలోని ఓ మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి మసీదు పైకప్పు కుప్పకూలిపోయింది. తాలిబన్‌, ఐసిస్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ఘటనకు బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు. మృత దేహాలను, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా, 32 మంది మృత్యువాత పడగా, 50 మంది క్షతగాత్రులు ఉన్నారని ఆసుపత్రి వైద్యుడు ఒకరు వెల్లడించారు. అయితే అధికారికంగా 28 మంది మృతిచెందినట్లు నంగార్‌ హర్‌ ప్రావిన్స్‌ అధికార ప్రతినిధి అతుల్లా ఖొయానీ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

కాగా, జులై - సెప్టెంబర్‌ మాసాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో దాడుల సంఖ్య పెరిగిందని ఐక్యరాజ్యసమితి గురువారం ప్రకటించింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాంబు దాడుల సంఖ్య 42 శాతం పెరిగిందని ఆ ప్రకటనలో ఉంది. ఈ దాడులను ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి టాడామిచి యమామోటో ఖండించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, పౌరుల ప్రాణాలు తీయడం సరికాదని అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు