ఉలిక్కిపడ్డ గెద్దలపాడు

10 Jan, 2020 13:14 IST|Sakshi
బాంబు పేలిన సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ సోమేశ్వరరావు

నాటుబాంబు పేలి ఇద్దరు విద్యార్థులకు గాయాలు

మూత్ర విసర్జనకు సరుగుడు తోటలోకి వెళ్లిన బాలురు

బంతి అనుకుని ఆడుతుండగా పేలుడు  

రాగోలు జేమ్స్‌ ఆస్పత్రికి తరలింపు

తీర ప్రాంతంలో ఆందోళన

శ్రీకాకుళం, సంతబొమ్మాళి: అంతవరకు అమ్మఒడి కార్యక్రమ సంబరాల్లో మునిగి తేలిన ఇద్దరు విద్యార్థులు మూత్ర విసర్జన కోసం పాఠశాల సమీపాన సరుగుడు తోటలోకి వెళ్లారు. అక్కడ బంతి ఆకారంలో వస్తువు కనిపించగా ఆతృతగా తీసుకున్నారు. అది నాటుబాంబు అని తెలియని ఆ పసివాళ్లు ఆనందంగా ఆడుతు న్నారు. ఇంతలో ఒక్కసారిగా పేలడంతో గాయాల పాలయ్యారు. దీని పేలుడు శబ్దానికి ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన సంతబొమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

స్థానికుల కథనం మేరకు... గెద్దలపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మఒడి కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. ఆ సమయంలో 6వ తరగతికి చెందిన విద్యార్థులు బొంగు తిరుపతిరావు, చింతల రాజు మూత్ర విసర్జన కోసం సమీప సరుగుడు తోటలోకి వెళ్లారు. అక్కడ బంతి ఆకారంలో కనిపించిన నాటుబాంబుతో ఆడారు. ఆ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలి గాయాలై స్పృహ తప్పి పడిపోయారు. ఈ శబ్దానికి ఉపాధ్యాయులు, స్థానికులు పరుగున అక్కడకు చేరుకున్నారు. గాయాలతో పడి ఉన్న వారిని గుర్తించారు. వెంటనే 108కి ఫోన్‌ చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం రాగోలు జెమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ముఖం, కాలు, చేతులపై గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి తహసీల్దార్‌ సోమేశ్వరావు, ఎంఈవో జే చిన్నవాడు, సంతబొమ్మాళి పోలీసులు చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని సంతబొమ్మాళి ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు.

అడవి పందులను సంహరించడానికేనా?
కొంతమంది వేటగాళ్లు అడవి పందులను సంహరించడానికే ఇక్కడ తోటల్లో నాటుబాంబులు వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటలోకి అడవి పందుల వచ్చి వాటిని తినే ప్రయత్నంలో పేలి చనిపోతాయి. చనిపోయిన అడవి పందులను మాంసంగా చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై విచారణ చేపడితే వాస్తవాలు బయట పడతాయని స్థానికులు కోరుతున్నారు. తాజా ఘటనతో సముద్ర దిబ్బల్లో, తోటల్లో ఎక్కడైనా నాటుబాంబులు ఉంటాయేమోనని, తీర ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా...  
పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నాయి. వీటికి నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. పరిసర ప్రాంతాలు కూడా అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ గత్యంతరం లేక మల, మూత్ర విసర్జనల సమయంలో బయటకు వస్తున్నారు. ఇలా రావడంతోనే నాటుబాంబు పేలుడికి విద్యార్థులు గాయాల పాలయ్యారు.

మరిన్ని వార్తలు