పెళ్లి కోసం పెరోల్‌.. తోసిపుచ్చిన హైకోర్టు

7 Aug, 2018 15:50 IST|Sakshi
గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేం(పాత చిత్రం)

ముంబై : గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెళ్లి కోసం తనకు 45 రోజుల పెరోల్‌ ఇవ్వాలని అబూ సలేం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్‌ రామిణి, న్యాయమూర్తి ఎంఎస్‌ సోనక్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అబూ సలేంకు పెరోల్‌ ముంజూరు చేయలేమని ధర్మాసనం పేర్కొంది. ఓ కేసు విచారణ నిమిత్తం లక్నోకు తరలించేటప్పడు ముంబ్రాకు చెందిన కౌసర్‌ బాహర్‌ అనే మహిళతో ప్రేమలో పడ్డానని.. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చానని అబూసలేం గతంలో వెల్లడించాడు. కౌసర్‌ కూడా తనకు అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు.

తాను చాలా ఏళ్లుగా జైలులో ఉన్నానని, ఒక మహిళకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని, అందువల్ల తనకు పెరోల్‌ కల్పించాలని అబూ సలేం తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను అతడి లాయర్‌ ఫర్హానా షా ధర్మాసనం ముందు ఉంచారు. వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం అతడి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను, గతేడాది టాడా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసిన సంగతి విదితమే. కాగా అతడు ప్రస్తుతం తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

మరిన్ని వార్తలు