వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

11 Apr, 2019 12:05 IST|Sakshi
మృతి చెందిన పాప

సాక్షి, సిద్దిపేటటౌన్‌: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిట్లోనే పాప మృతిచెందిన ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన లక్ష్మి, లింగయ్యల కుమార్తె రజిత అలియాస్‌ లక్ష్మిప్రియ (23)కి సికింద్రాబాద్‌ ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన మధుతో ఏడాది క్రితం వివాహం జరిగింది. డెలివరీ కోసం తల్లిగారింటికి వచ్చిన లక్ష్మిప్రియకు మంగళవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు ఎక్కువ రావడం లేదని అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొద్దికొద్దిగా పురిటి  నొప్పులు రావడంతో మరోసారి పరీక్షించి సాయంత్రం వరకు చూడాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఈలోగా పురిటినొప్పులు తగ్గడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పరీక్షించి శిశువు ఉమ్మ నీరు తాగిందని, కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తేనే ఆపరేషన్‌ చేస్తామని డ్యూటీ డాక్టర్‌ స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆపరేషన్‌ చేసి పాప కడుపులోనే మృతి చెందిందని డాక్టర్‌ చెప్పినట్లు బంధువులు ఆరోపించారు. పాప మృతికి డాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమని, పాప మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని పాప తండ్రి మధు డిమాండ్‌ చేశారు. పాప మృతిచెందిన విషయం డాక్టర్లు చెప్పగానే సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసామని, అయినా పోలీసులు డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధు ఆరోపించారు. ఈ విషయంపై వన్‌ టౌన్‌ ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

మరిన్ని వార్తలు