ఆ కిరాతకానికి పాల్పడింది వీళ్లే..!

13 Feb, 2018 12:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం రేపిన బొటానికల్‌ గార్డెన్‌ వద్ద గర్భిణీ మృతదేహం పడేసిన కేసులో పోలీసులు నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిండు గర్భిణీ అన్న కనీస కనికరం లేకుండా ఆమెను హతమార్చిన నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతురాలు పింకీ స్వస్థలం బిహార్‌లోని కుగ్రామమని, వివాహేతర అక్రమ సంబంధాలే ఆమెను బలిగొన్నాయని తెలిపారు.

దారుణం జరిగిందిలా..
బిహార్‌కు చెందిన బింగి అలియాస్‌ పింకీకి దినేశ్‌ అనే వ్యక్తితో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 2017లో భర్తను విడిచిపెట్టిన పింకీ.. వికాస్‌ అనే వ్యక్తితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. అయితే, వికాస్‌కు అంతకుముందు నుంచే మమతా ఝా అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. మమతా ఝా, అనిల్‌ ఝా భార్యాభర్తలు.. వారి కుమారుడు అమర్‌కాంత్‌ ఝా. బతుకుదెరువు కోసం వీరు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడు వికాస్‌ను వెతుక్కుంటూ పింకీ కూడా హైదరాబాద్‌ వచ్చింది. ఇక్కడ అమర్‌ కాంత్ కుటుంబంతో కలిసి ఉంటున్న వికాస్‌కు అతని తల్లి మమతతో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని పింకీ గ్రహించింది. దీని గురించి వికాస్‌ను నిలదీసింది. ఈ కోపంలోనే గత నెల 29న పింకీపై నలుగురూ దాడి చేశారు. వారు కిరాతకంగా కొట్టడంతో కడుపులోని పాప సహా పింకీ చనిపోయింది. ఆ తర్వాత స్టోన్‌ కట్టర్‌తో మృతదేహాన్ని ముక్కలు చేసి..గోనెసంచిలో పడేసి.. రాత్రి సమయంలో బైక్‌ మీద మృతదేహాన్ని తరలించారు. ఈ కేసులో నిందితులైన మమతా ఝా, అనిల్ ఝా, అమర్‌కాంత్‌ ఝా, వికాస్‌లను అరెస్ట్ చేశారు. చాలెంజ్‌గా మారిన ఈ మర్డర్‌ మిస్టరీని సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. 150 సీసీ కెమెరాల్లో ఈ ఘటనను పరిశీలించి.. నిందితుల ఆచూకీ కనిపెట్టినట్టు సీపీ సందీప్‌ శాండిల్య మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు