పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..

7 Feb, 2019 02:32 IST|Sakshi
దాడికి ఉపయోగించిన కత్తి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

అత్యంత విషమంగా బాధితురాలి పరిస్థితి

48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమంటున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమోన్మాది భరత్‌ చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక(17) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆమె పల్స్‌రేటు పడిపోయింది. బీపీ లెవల్స్‌ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. బాధితురాలి శరీరంపై 14 చోట్ల బలమైన కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తల పైభాగంలో కత్తిగాటుకు పుర్రె రెండుగా చీలిపోయింది. మెదడులోని కీలక నరాలు తెగిపోయాయి. అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉంది. మెడ పైభాగంలోనూ బలమైన గాయమైంది.

దవడ సహా రెండు చేతుల మణికట్టుల వద్ద రెండు సెంటీమీటర్ల లోతు తెగిపోయింది. అరచేతులు, వేళ్లపై బలమైన గాట్లు పడ్డాయి. చేతివేలి కీళ్లు విరిగి బయటికి కన్పిస్తున్నాయి. ఎడమచేతి వేలు ఒకటి పూర్తిగా తెగిపోయింది. రక్తం ఎక్కువగా పోవడంతో ఇప్పటివరకు ఐదు బాటిళ్ల రక్తం ఎక్కించారు. కత్తిగాట్ల వల్ల తెగి వేలాడుతున్న శరీర భాగాలకు కుట్లు వేశారు. అధిక రక్తస్రావాన్ని నియంత్రించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. రక్తస్రావం ఆగిపోయి, బీపీ, పల్స్‌రేట్‌ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు