బుసలు కొట్టిన ప్రేమోన్మాదం

7 Feb, 2019 01:55 IST|Sakshi
నిందితుడు భరత్‌

హైదరాబాద్‌ బర్కత్‌పురలో దారుణం

ప్రేమించడంలేదని ఇంటర్‌ విద్యార్థినిపై డిగ్రీ విద్యార్థి కక్ష

కొబ్బరిబొండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి

14 చోట్ల తీవ్రగాయాలతో కుప్పకూలిన బాధితురాలు

వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు

ఏడాదిగా యువతి వెంట పడుతున్న నిందితుడు

షీ టీమ్స్‌ కౌన్సెలింగ్‌ చేసినా మారని వైనం

పథకం ప్రకారం కాపుకాసి దాడికి తెగబడ్డ ఉన్మాది

మాటు వేసి నిందితుడు భరత్‌ను పట్టుకున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ప్రేమోన్మాదం బుసలు కొట్టింది. ప్రేమించడంలేదనే కోపంతో ఇంటర్‌ విద్యార్థినిపై డిగ్రీ చదువుతున్న యువకుడు దాడికి తెగబడ్డాడు. బుధవారం ఆమె ఇంటికి సమీపంలోనే కాపుకాసి కొబ్బరిబొండాలు నరికే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. 14 చోట్ల తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దాడి చేసిన అనంతరం పరారైన నిందితుడిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని కాచిగూడ పోలీసులకు అప్పగించారు.

బర్కత్‌పుర సత్యనగర్‌కు చెందిన మంగ రాములు, ఉదయ దంపతుల రెండో కుమార్తె మధులిక (17) నల్లకుంట శివం రోడ్డులోని శరత్‌ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే బస్తీలో నివసిస్తున్న వేణుగోపాల్, కళ్యాణి దంపతుల కుమారుడు చిట్కూరి భరత్‌ అలియాస్‌ సోను(19) రాంకోఠిలోని జాగృతి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిగా మధులిక వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు గతనెల 7న షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భరత్, మధులికలతో పాటు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మధులికను మళ్లీ వేధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భరత్‌ను హెచ్చరించి, ఇంటికి పంపించివేశారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. పైగా వేధింపులు మరింత పెంచాడు. ఎంతగా వెంటపడుతున్నా ప్రేమించకపోవడంతో ఆమెపై కక్ష కట్టి, హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల క్రితం కాచిగూడలోని ఓ కొబ్బరిబొండాల దుకాణం నుంచి కత్తి చోరీ చేశాడు. దానిని తన ఇంట్లోనే ఎవరికీ కనపడకుండా దాచిపెట్టాడు. బుధవారం ఉదయం ఆ కత్తిని ఓ పేపర్‌లో చుట్టి కవర్‌లో పెట్టుకుని బయటకు వచ్చాడు. మధులిక ఇంటి సమీపంలోనే నివసించే భరత్‌ సమీప బంధువు ఇంటివద్ద కాపుకాశాడు. 

తొలుత వాగ్వాదం.. ఆపై దాడి..
ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాలకు బయలుదేరిన మధులికను చూసిన భరత్‌.. వెంటనే ఆమె వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆ సందు ఇరుకుగా ఉండటంతో అతడిని తప్పించుకుని ఆమె ముందుకు వెళ్లలేకపోయింది. సహాయం కోసం భరత్‌ కాపుకాసిన ఇంట్లోకి వెళ్లింది. అయితే, అక్కడ ఎవరూ లేకపోవడం.. ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో వరాండాలో ఆగిపోయింది. ఈ క్రమంలో ఆమె వెనకే వచ్చిన భరత్‌.. తన వద్దనున్న కత్తితో మధులికపై దాడి చేశాడు. మెడపై వేటు వేయబోగా.. చేతులు అడ్డం పెట్టుకోవడంతో ఆమె బొటనవేలు తెగిపోయింది. అయినా ఆగని నిందితడు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె మెడ, చేతులు, ముఖం, పొట్ట, ఛాతిలో మొత్తం 14 చోట్ల గాయాలయ్యాయి. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు అక్కడకు వచ్చినప్పటికీ, భరత్‌ చేతిలో కత్తి ఉండటంతో అతడిని ఆపే ధైర్యం చేయలేకపోయారు. తీవ్ర గాయాలతో మధులిక కుప్పకూలిన తర్వాత భరత్‌ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి, రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని తొలుత కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కోసం మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

మూసీ నది వద్ద పట్టుకున్నాం
భరత్‌ను పట్టుకోవడానికి నాలుగు బృందాలు పని చేశాయి. మూసీ నది వద్ద ఓ ఇంట్లో దాక్కుని ఉండగా మాటువేసి అదుపులోకి తీసుకున్నాం. భరత్‌కు ఇప్పటి వరకు ఎలాంటి నేరచరిత్ర లేదు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. మధులిక ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. – ఎం.రమేష్, ఈస్ట్‌జోన్‌ డీసీపీ
 

మరిన్ని వార్తలు