నరకం చూపారు..

9 Mar, 2018 12:30 IST|Sakshi
నాలుగు నెలల తర్వాత గాయాలతో ఇంటికి చేరిన జయరాజు కోడ జయరాజు తప్పిపోయినట్టు ప్రచురించిన గోడపత్రిక

నాలుగు నెలలుగా ఉప్పాడ యువకుడికి కడపలో చిత్రహింసలు

చంపుతామని బెదిరించి చేపల వేట సాగించిన వైనం

చివరకు తప్పించుకుని ఇంటికి చేరిన యువకుడు

నాలుగు నెలల క్రితం ఓ యువకుడు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. కుటుంబసభ్యులు,బంధువులు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు..నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు ఆ యువకుడు ఒంటి నిండా గాయాలతో ఇంటికి చేరాడు. తనను కొందరు మోసం చేసి తీసుకువెళ్లి నాలుగునెలలపాటు చిత్రహింసలకు గురిచేశారని  వారి చెర నుంచి తప్పించుకు వచ్చానని తెలిపాడు. వివరాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి,పిఠాపురం: కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన కోడ జయరాజు (20) పదో తరగతి పాసయ్యాడు. ఇంటర్‌ ప్రైవేటుగా చదువుతూ కాకినాడలో ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. గత ఏడాది నవంబర్‌ 20వతేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అన్ని ప్రాం తాల్లో గాలించినా అతడి బంధువులు కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నాలుగు నెలలు దాటినా ఆయువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఇంతలో బుధవారం రాత్రి ఆయువకుడు ఒంటి నిండా గాయాలతో ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆ యువకుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

మాయమాటలతో నమ్మించారు.
తనను కొవ్వూరుకు చెందిన బెణుగు శ్రీను మరి కొందరు మాయ మాటలతో నమ్మించి సుదూర ప్రాంతలకు తీసుకెళ్లి నిర్బంధించి చేపల వేట చేయించారని ఆ యువకుడు చెబుతున్నాడు. గతేడాది నవంబర్‌ 20న అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కోడ జయరాజు తుని వెళ్లాడు. అక్కడ తన బంధువుల ఇంటికి వెళదామని భావించినా చివరకు తన దగ్గర రూ.400 ఉండడంతో వాటితో రెండు రోజులు తునిలో తిరుగుతూ చివరికి రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బు అయిపోవడంతో తినడానికి ఏమీ లేక ఆకలితో రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం బస్టాండ్‌లో ఉన్న అతడి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆరా తీశారు. భోజనం పెట్టి డబ్బులు ఇస్తామని తాము చెప్పిన పని చేయాలని చెప్పడంతో ఆకలితో ఉన్న బాధితుడు దానికి అంగీకరించి వారి వెంట వెళ్లాడు.

చిత్రహింసలకు గురిచేసేవారు
తొలుత కొవ్వూరు తీసుకెళ్లిన వారు నాలుగు రోజుల అనంతరం కడప దగ్గరలోని ఒంటిమిట్టకు దూరప్రాంతమైన కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ నదీపాయలలో చేపల వేట చేయమని చెప్పారని బాధితుడు తెలిపాడు. తాను మత్స్యకార కుటుంబానికి చెందిన వాడినైనా వేటకు ఎప్పుడు వెళ్లలేదని తనకు రాదని చెప్పడంతో తీవ్రంగా కొట్టిన వారు బలవంతంగా చేపల వేట చేయించేవారన్నాడు. ప్రతి రోజూ రాత్రి సమయాల్లో వేటకు తీసుకువెళ్లే వారని, వారు చెప్పినట్టు చేయకపోతే చిత్రహింసలు పెట్టేవారని వాపోయాడు. మూడు సార్లు తప్పించుకోడానికి ప్రయత్నించగా పట్టుకున్న వారు తాళ్లతో బంధించి చితక్కొట్టేవారని  కన్నీరుమున్నీరవుతున్నాడు.

రెండు సార్లు తనపై హత్యాయత్నం చేశారని, చేసేదేం లేక వారు చెప్పినట్టు వేట చేసే వాడినన్నాడు. చివరకు ఈనెల నాలుగో తేదీన అర్ధరాత్రి చేపల వేట సాగిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళతానని చెప్పి తప్పించుకున్నానని తెలిపాడు. ఓ గ్రామంలో గొర్రెల కాపరులు తనను రెండు రోజుల పాటు తమ దగ్గర ఉంచుకుని చివరకు డబ్బులిచ్చి ఇంటికి వెళ్లిపొమ్మని పంపించడంతో బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నానని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయాన్ని కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కడప పరిసర ప్రాంతాల్లో ఇలాగే చాలా మందితో నిర్బంధంగా వేట చేయిస్తుంటారని తమ కుమారుడిని చిత్రహింసలకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జయరాజు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు