లిఫ్ట్‌ మీద పడి బాలుడి దుర్మరణం

23 Oct, 2017 03:41 IST|Sakshi

 అపార్ట్‌మెంట్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు 

చంపాపేట డివిజన్‌ దుర్గానగర్‌లో విషాదం

హైదరాబాద్‌: అపార్ట్‌మెంట్‌ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలయ్యాడు. తెరిచి ఉన్న సెల్లార్‌ లిఫ్ట్‌ క్యాబిన్‌లోకి తొంగిచూసిన చిన్నారిపై లిఫ్ట్‌ వచ్చి పడింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్‌ చంపాపేట డివిజన్‌ దుర్గానగర్‌లో జరిగింది. దుర్గానగర్‌లోని శ్రీ సత్యసాయి ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ చొల్లంగి శ్రీనివాస్, సూర్యకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాజులూరులోని తర్లంపుడి గ్రామం.

ఆదివారం ఉదయం శ్రీనివాస్‌ పెద్ద కుమారుడు వెంకట తస్వంత్‌(8) ఆడుకుంటూ వెళ్లి ఎలాంటి రక్షణ లేని లిఫ్ట్‌ సెల్లార్‌ క్యాబిన్‌లోకి తొంగి చూస్తున్నాడు. అదే సమయంలో పైఅంతస్తు నుంచి దూసుకువచ్చిన లిఫ్ట్‌ బాలుడిపై పడింది. దీంతో తస్వంత్‌ తలకు తీవ్ర గాయమైంది. తల్లి గమనించి కుమారుడిని బయటకు తీసుకువస్తుండగా అప్పటికే మృతిచెందాడు. ఆడుతూ కనిపించిన కుమారుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  తస్వంత్‌ మరణానికి అపార్ట్‌మెంట్‌ నిర్వాహకు ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. సెల్లార్‌లో లిఫ్ట్‌ చుట్టూ రక్షణ చర్యలు తీసుకోలేదని, దీంతో బాలుడు ప్రమాదానికి గురయ్యాడని అన్నారు. శ్రీను కుటుంబాన్ని అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులే బాధ్యత వహించాలి: బాలల హక్కుల సంఘం 
తస్వంత్‌ మృతికి అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్‌రావు డిమాండ్‌ చేశారు. సెల్లార్‌లో లిఫ్ట్‌ చుట్టూ రక్షణ గోడలు లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, అపార్ట్‌మెంట్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల నగరంలో తరచూ లిఫ్ట్‌ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బాలుడి కుటుంబానికి  నిర్వాహకులు నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు