రెప్పపాటులోఘోరం!

5 May, 2018 14:01 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న సీఐ శ్రీనివాసరావు

 బాలుడిని చిదిమేసిన గ్రావెల్‌ ట్రాక్టర్‌

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

కొత్తూరులో విషాదం

సమయం శుక్రవారం ఉదయం 8.30 గంటలు. అప్పటి వరకూ ఆ బాలుడు తోటిపిల్లలతో ఆడుకున్నాడు. తరువాత తల్లిదండ్రుల కోరిక మేరకు రాగులను పిండి ఆడించేందుకు సమీపంలో ఉన్న మిల్లుకు సైకిల్‌పై బయలుదేరి వెళ్లాడు. అయితే మృత్యువు బాలుడిని వెంటాడింది.

ట్రాక్టర్‌ రూపంలో వచ్చి కబళించింది. ఈ విషాద సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రావెల్‌ను తీసుకొని వెళ్తున్న ట్రాక్టర్‌ సైకిల్‌పై వెళ్తున్న బాలుడు పిన్నింటి వరుణ్‌ కుమార్‌ (12)ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన కన్నవారికి గర్భశోకాన్ని.. స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.      

కొత్తూరు : కొత్తూరు బోరవీధికి చెందిన పిన్నింటి రమేష్,  భాగ్యం దంపతులకు ఇద్దరు మగపిల్లలు. వీరిలో పెద్ద కుమారుడు వంశీ స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి, రెండో కుమారుడు వరుణ్‌కుమార్‌ ఏడో తరగతి చదువుతున్నారు. వేసవి సెలవు కావడంతో ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్నారు. వరుణ్‌కుమార్‌ను రాగులు తీసుకొని మిల్లుకు వెళ్లి పిండి ఆడించుకొని తీసుకురమ్మని తల్లిదండ్రులు కోరారు. దీంతో ఎన్‌.ఎన్‌.కాలనీలో ఉన్న మిల్లుకు చోళ్లు తీసుకొని వరుణ్‌కుమార్‌ బయలుదేరి వెళ్లాడు.

ఎన్‌.ఎన్‌. కాలనీ కూడలి కొద్ది దూరంగా ఉండనగా.. నివగాం నుంచి కొత్తూరు నాలుగు రోడ్లు కూడలి వైపు గ్రావెల్‌ లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ సైకిల్‌పై వెళ్తున్న వరుణ్‌కుమార్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బాలుడ్ని కొత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యాధికారి ప్రవీణ్‌ స్పష్టం చేశారు. కొడుడు చనిపోయినట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు భాగ్యం, రమేష్, అమ్మమ్మ రమణమ్మ, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.

కొడుకు మృతదేహంపై తల్లి భాగ్యం పడి రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కన్నీరు పెట్టించింది. చిన్న వయసులోనే అందని లోకానికి వెళ్లిపోయా కొడుకా అంటూ కన్నీరు పెట్టింది. వరణ్‌ మరణంతో అమ్మమ్మ రమణమ్మ స్పృహ తప్పి పడిపోయింది. బాలుడు తండ్రి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై విజయకుమార్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సీఐ జె.శ్రీనివాసరావు కూడా ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  స్థానిక ఎంపీటీసీ సభ్యడు లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు, సీహెచ్‌సీ చైర్మన్‌ పోత్రకొండ మోహనరావులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

వరుస ప్రమాదాలతో ఆందోళన 

స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదల్లో ఏడుగురు చనిపోవడంతో రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. ఇసుక ట్రాక్టర్‌లు, వంశధార ప్రాజెక్టు పనులకు వస్తున్న టిప్పర్లతో ఈ ప్రాంతం రద్దీగా మారిం ది. ఈ వాహనాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు