నిర్లక్ష్యానికి పసిప్రాణం బలి   

13 Jun, 2018 10:59 IST|Sakshi
పాముకాటుకు గురై మృతిచెందిన బాలుడు 

ఆస్పత్రిలో స్పందించని సిబ్బంది!

పాముకాటుతో మృతి చెందినట్లు నిర్ధారణ

డ్యూటీడాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని బాధితుల ఆందోళన

సెక్యూరిటీ గార్డు సస్సెన్షన్‌

మెదక్‌జోన్‌/పాపన్నపేట(మెదక్‌) :  పాముకాటుకు గురైన బాలుడిని ఆస్పత్రికి తీసుకురాగ సిబ్బంది నిర్లక్ష్యంతో సకాలంలో  వైద్యచికిత్సలు చేయక ఐదేళ్లబాలుడు మృతిచెందిన సంఘటన పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు... పాపన్నపేట మండల కేంద్రానికి చెందిన నర్సింలు–సంతోషి దంపతుల చిన్న కుమారుడు హరిప్రసాద్‌(5)కు మంగళవారం రాత్రి  వాంతులు చేసుకోవటం ప్రారంభించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిని  పాపన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు.

అక్కడ పరీక్షలు జరిపిన సిబ్బంది  బాలుడికి పాము కాటువేసిందని పరిస్థితి విషమించిందని వెంటనే మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పటంతో మెదక్‌ తరలించారు. ఆస్పత్రి బయట ఉన్నసెక్యురిటీ గార్డు వీరిని గమనించి   ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యుడు లేడని ప్రైవేట్‌ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చినట్లు మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు.

దీంతో వారు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తెసుకెళ్లేలోపే బాలుడి పరిస్థితి విషమించిందని, ప్రైవేట్‌ వైద్యుడు పేర్కొనటంతో చేసేదిలేక మల్లీ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

మా కొడుకు చావుకు కారణం సిబ్బందితో పాటు డ్యూటీలో ఉన్న వైద్యుడి నిర్లక్ష్యంమేనని, తాము రాగానే చికిత్సలు చేసి ఉంటే మా కొడుకు బతికేవాడని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డ్యూటీ వైద్యుడితో పాటు నిర్లక్ష్యంతో బయటకు పంపిన సిబ్బందిని సైతం తక్షణమే సస్పెండ్‌ చేయాలని మృతుడి బంధువులు, డిమాండ్‌ చేశారు. 

సస్పెండ్‌ చేయాలి...

పాముకాటుతో ఆస్పత్రికి వచ్చిన బాలుడిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్సలు అందించకుండా  బయటకు పంపి బాలుడి మృతికి కారణమైన డ్యూటీ డాక్టర్‌తో పాటు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి బయటకు పంపిన వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు.

ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బాల్‌రాజ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కటికె (ధర్మాకర్‌) శ్రీనివాస్, సీపీఎం నాయకుడు మల్లేశం, బాలమణిలు డిమాండ్‌ చేశారు. 

రూ.20వేల ఆర్థిక సాయం అందజేత

కాగా ఈ సెక్యురిటీ గార్డు ప్రైవేట్‌ ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో స్పందించిన కాంట్రాక్టర్‌ తక్షణ సాయం కింద బాలుడి తల్లిదండ్రులకు రూ.20వేల ఆర్థికసాయం అందించాడు. అంతేగాక  ఇద్దరికి ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు.

సెక్యూరిటీగార్డు పై వేటు...

పాముకాటుకు గురైన బాలుడిని ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాధితులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన సెక్యూరిటీ గార్డును సస్పెండ్‌ చేశాను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం    – పీసీ శేఖర్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు