ఎంత ఘోరం!

6 Mar, 2019 09:05 IST|Sakshi
రోదిస్తున్న కార్తీక్‌ తల్లి భాగ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు త్రివేణి సంగమంలో మునిగి పోలీసుల చేతిలో విగత జీవిగా..

పుణ్యస్నానానికి వచ్చి పరలోకానికి..

తల్లిదండ్రుల కళ్లెదుటే బాలుడు మృతి

కన్నీటి సంద్రమైన త్రివేణీ సంగమం

అంత వరకు అక్కడే ఆడుకున్నాడు.. కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తూ కేరింతలు, తుళ్లింతలతో ఆనందంగా గడిపాడు.. అంతలో ఏమైందో ఎలా జరిగిందో గానీ ఆ బాలుడు నీళ్లలో కొట్టుకుపోయాడు.. ఈ విషయాన్ని ఒడ్డుకు వచ్చే వరకు తల్లిదండ్రులు గమనించలేదు.. అల్లంత దూరంలో కుమారుడిని చూసి లబోదిబోమన్నారు.. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే        జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

శ్రీకాకుళం, వంగర: కళ్లెదుటే పేగుబంధం తెగిపోయింది. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని పరమశివుడిని వేడుకోవడానికి వచ్చిన ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. తమ బంధువులు, స్నేహితులతో దైవదర్శనానికి వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తుండగా ఇటు తల్లిదండ్రులు, అటు బంధువులు, మరో పక్క స్నేహితుల మధ్యన నదిలో స్నానమాచరిస్తున్న బాలుడు.. విగత జీవుడై విషాదం నింపాడు. ఈ ఘటన వంగర మండలం సంగాంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడు నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద జరిగింది. తల్లిదండ్రుల కలల పంట కార్తీక్‌ పాణిగ్రాహి (10) వారికి కన్నీరు మిగులుస్తూ నీటి పాలయ్యాడు. సంగమేశ్వరస్వామి దర్శనార్ధం, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకోసం కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన జగన్నాథ పాణిగ్రాహి, భాగ్యలక్ష్మి, సోదరి భవానితో కలిసి పాలకొండ మండలం మల్లివీడు సింగుపురం గ్రామంలో ఉన్న పిన్ని వేపాకుల విజయలక్ష్మి, చిన్నాన్న వేపాకుల రామకృష్ణల ఇంటికి చేరుకున్నారు. ఈ రెండు కుటుంబాలతోపాటు ఒడిశాలోని పలు ప్రాంతాలకు చెందిన బంధువులతో కలిసి మంగళవారం వేకువజామున సంగాంకు వచ్చారు.

ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకోవాలని కుమారుడు కార్తీక్, కుమార్తె భవానితో కలిసి జగన్నాథ్‌ దంపతులు 25మందితో త్రివేణి సంగమం ప్రాంతానికి వెళ్లారు. రేగిడి మండలం సరసనాపల్లి పంటపొలాలను ఆనుకొని ఉన్న నదీ ప్రాంతమంతా కొద్దిపాటి లోతు ఉంటుంది. ఈ ప్రాంతంలో కార్తీక్‌ అందరితో కలిసి స్నానం చేస్తున్నాడని భావించి.. అక్కడి వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. కార్తీక్‌ కనిపించకపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారంతా నదిలో గాలించగా వారు స్నానం చేసే ప్రాంతానికి 15 మీటర్ల దూరంలో కార్తీక్‌ ఆచూకీ లభ్యమైంది. బందోబస్తులో ఉన్న పోలీసులు హుటాహుటిన సంగమం ప్రాంతం నుంచి యాత్ర స్థలి వరకు బైక్‌పై బాలుడిని తరలించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో.. ఎస్సై జి.అప్పారావు స్పందించి వంగర పీహెచ్‌సీకి పోలీసు వాహనంలో కార్తీక్‌ను తరలించారు. వైద్యుడు వి.రాము బాలుడిని తనిఖీ చేసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ట్రెయినీ ఎస్సై కొత్తూరు శిరీష బాలుడి మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పారాపురంలో విషాద చాయలు
కొత్తూరు: కార్తీక్‌ పాణిగ్రాహి మృతితో బాలుని స్వస్థలం పారాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు స్థానిక హోలీక్రాస్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో 4 తరగతి చదువుతున్నాడు. కార్తీక్‌ మృతి చెందిన వార్త పారాపురంలో తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాలలో మంచి తెలివైన విద్యార్థిగా గుర్తింపు ఉన్న కార్తీక్‌ మృతి చెందడాన్ని ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నతనంలోనే అందని లోకానికి కొడుకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఎంతో మంచి చదువులు చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలన్న వారి ఆశలు త్రివేణి సంగమంలో గల్లంతయ్యాయి.

తల్లడిల్లిన తల్లి హృదయం
తన కొడుకు మరణవార్త విని తల్లి భాగ్యలక్ష్మి తల్లడిల్లింది. పుణ్యస్నానం ఆచరించి దైవదర్శనం చేస్తే మంచి భవిష్యత్‌ వస్తుందని దేవాలయానికి తెస్తే ఏకంగా ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయావా అంటూ కార్తీక్‌ తల్లి భాగ్యలక్ష్మి, తండ్రి జగన్నాథ్‌లు గుండెలు అవిసేలా ఏడ్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఘటనపై ఆరోగ్య సిబ్బంది, దేవాదాయశాఖ స్పందించిన తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివేణి సంగమ ప్రాంగణంలో అరకొరగా హెచ్చరిక బోర్డులున్నాయని వారు ఆరోపించారు.

మరిన్ని వార్తలు