నిర్లక్ష్యానికి బాలుడు బలి!

24 Apr, 2019 14:01 IST|Sakshi
నీళ్లట్యాంకులో పడి మృతి చెందిన బాలుడు(ఫైల్‌) బలిగొన్న నీళ్లట్యాంకు

అనధికార ట్యాంకులో పడి మృతి

చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్‌

కృత్తివెన్ను(పెడన): అప్పుడు వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి చిట్టిపొట్టిమాటలు మూగబోయాయి.. వచ్చిరాని మాటలతో చిట్టిపొట్టి అడుగులతో అలరించిన ఏడాదిన్నర వయసున్న ఆకాష్‌ను అనధికారికంగా ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకు బలితీసుకుంది. ఎక్కడో బోరుబావుల్లో పడి చిన్నారులు మరణిస్తున్న వార్తలను టీవీలు, పత్రికల్లో చూసిన స్థానికులు తమ గ్రామంలోనే నీళ్ల ట్యాంకులో పడి బాలుడు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాలు.. మండల పరిధిలోని తాడివెన్ను అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన నీళ్లట్యాంకులో పడి ఈదా జోజిబాబు కుమారుడు ఆకాష్‌ మృత్యువాత పడ్డాడు. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులతో పాటు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసింది.

స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద గల నీటికుళాయి నుంచి వచ్చే నీరు పట్టుకునేందుకు అంగన్‌వాడీ కార్యకర్త వరలతో ట్యాంకు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ట్యాంకుపై రక్షణగా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అటుగా వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తు ట్యాంకులో పడిపోయాడు. దీనిని ఎవరూ గమనించలేదు. కొంత సమయం తరువాత బాలుడి బంధువులు వెదకగా ట్యాంకులో బాలుడు శవమై కనిపించాడు. అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ట్యాంకు ఏర్పాటు చేయడం కారణంగానే బాలుడు మరణించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఘటనా స్థలానికి వచ్చిన ఐసీడీఎస్‌ సీడీపీఓ రాజ్యలక్ష్మికి దీనిపై వారు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ తులసీరామకృష్ణ,  రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ త్రీనాథ్‌ పరిశీలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన నీళ్లట్యాంకు సంగతి తమకు తెలియదని, ట్యాంకు ఏర్పాటు చేయడంపై తమకెలాంటి సమాచారం లేదని సీడీపీఓతో పాటు సూపర్‌వైజర్‌ ప్రసూన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు