బాలుడిని మింగేసిన కాలువ

11 Oct, 2019 08:23 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : రోజూ మారిదిగానే ఆ బాలుడు గ్రామం చెంతనే ఉన్న వంశధార కుడి కాలువ గట్టుకు స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. కాలువలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారిపోవడంతో కొట్టుకుపోయాడు. ఈ విషాద సంఘటన హిరమండలం మేజర్‌ పంచాయతీ పరిధిలోని చిన్నకోరాడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చిన్నకోరాడకు చెందిన చోడి రాము, స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు స్థానిక కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు.

చిన్న కుమారుడు దామోదరరావు (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గ్రామం పక్కనే ఉన్న వంశధార కుడి కాలువలో ప్రతి రోజూ కాలకృత్యాలు తీర్చుకోవడానికి దామోదరరావు వెళ్తుండేవాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో కాలువ వైపు వెళ్తానని ఇంటి వద్ద చెప్పాడు. కాలకృత్యాలు తీర్చుకుని కాలువలోకి దిగాడు. కాలుజారిపోవడంతో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు కేకలు వేసుకుంటూ గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బాలుడి కోసం కాలువలో దిగి వెతికారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ కె.గోవిందరావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాక సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లతో బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వంశధార అధికారులతో మాట్లాడి కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. రాత్రి 7 గంటల సమయంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. దసరా సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు పెద్దెఎత్తున అక్కడకు చేరుకున్నారు. తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. నిరుపేద కుటుంబమైనా పిల్లలిద్దరూ చదువులో చురుగ్గా ఉండేవారు. నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.      

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా