24 గంటల్లోనే కిడ్నాప్‌ కేసు ఛేదించారు!

21 Aug, 2018 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏడేళ్ల బాలుడు కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సీసీ టీవీ దృశ్యాలు, బస్సు నంబర్‌ ఆధారంగా కిడ్నాప్‌ చేసిన మహిళ ఆచూకీ కనుగొన్న పోలీసులు.. గోపాలపురంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని ఇద్దరు మహిళలు.. బిస్కెట్లు ఇప్పిస్తామని చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. బాలుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైయ్యాయి. ప్రయాణికుల ముసుగులో ఇద్దరు మహిళలు ఆయూష్‌ను కిడ్నాప్‌ చేసి ఉడాయించారు.

ఉపాధి కోసం నగరానికి...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజు, దిలీప్‌ భార్యాభర్తలు. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బండ్లగూడలో ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆయుష్‌ (7), కూతురు (10) సంతానం. కొంతకాలం క్రితం దిలీప్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. స్వీపింగ్‌ పని చేసుకుంటూ సంజు తన పిల్లలను పోషించుకుంటోంది. కాన్పూర్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చిన సంజూకు అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు. సోమవారం ఆ మహిళలకు తన పిల్లలను అప్పగించిన సంజు టిఫిన్‌ కోసం స్టేషన్‌ బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళలు బిస్కెట్లు కొనిస్తామంటూ బాలుడిని బయటకు తీసుకువెళ్లారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడం, ఆయుష్‌ కనిపిం చకపోవడంతో సంజు రైల్వే పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆ కిలాడీ లేడీలే బాలుడిని కిడ్నాప్‌ చేసినట్టు నిర్ధారించుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు, నిందితులు ఎక్కిన బస్సు నెంబర్‌ ఆధారంగా 24 గంటల్లోనే వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరిగి తల్లి ఒడికి చేర్చారు.

>
మరిన్ని వార్తలు