మత్తు మందు ఇచ్చి బాలుడి కిడ్నాప్‌

9 May, 2019 07:42 IST|Sakshi
బాలుణ్ని తల్లికి అప్పగిస్తున్న సీపీ మహేష్‌భగవత్‌

కేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్టు

బాలుణ్ని తల్లికి అప్పగించిన సీపీ   

నాగోలు: తల్లికి, అమ్మమ్మకు మత్తు మందు ఇచ్చి 6 నెలల బాలుడిని కిడ్నాప్‌ చేసి రూ.10 వేలకు అమ్మిన కేసులో ఇద్దరు వ్యక్తులను పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బాలుణ్ని తల్లికి అప్పగించారు. బుధవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్‌ చెందిన షేక్‌ అహ్మద్‌ (28) పుట్టుకతోనే దివ్యాంగుడు. హైదరాబాద్‌కు వచ్చి పహడీ షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలానగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

ఇతడికి శంషాబాద్‌ ప్రాంతంలో నివసించే చెందిన సోనీ కుటుంబ సభ్యులతో పరిచయం ఉంది. ఈ నెల 3న సోనీ ఆమె తల్లితో కలిసి తన 6 నెలల బాలుడు సాయి తీసుకోని అహ్మద్‌ ఇంటికి వెళ్లింది. వీరికి అహ్మద్‌ అన్నంలో మత్తు మందు కలిపి పెట్టాడు. అనంతరం వారు మత్తులోకి జారుకున్నాక బాలుడు సాయి తీసుకొని శాహిన్‌నగర్‌కి చెందిన ఫయజ్‌ అలీకి రూ.10 వేలకు విక్రయించాడు. మత్తు నుంచి తేరుకున్న సోనీ, ఆమె తల్లికి బాలుడు సాయి, అహ్మద్‌ కనిపించకపోవడంతో షహడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. బాలుణ్ని కిడ్నాప్‌ చేసిన షేక్‌ అహ్మద్‌ను, కొనుగోలు చేసిన ఫయజ్‌ అలీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారిని తల్లి సోనీకి పోలీస్‌ కమిషన్‌ మహేష్‌ భగవత్‌  చేతుల మీదుగా అంద జేశారు.సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్, రాచకొండ ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ రవికుమార్, రాజు, శంకర్, శ్రీశైలం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు