కన్నతల్లిని కడతేర్చిన 15 ఏళ్ల బాలుడు

20 Aug, 2018 16:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడు స్కూల్‌కు వెళ్లనందుకు మందలించిన కన్నతల్లినే కడతేర్చాడు. శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. 35 ఏళ్ల కుమారి ఉయ్క తన ఇద్దరు పిల్లలతో(ఒక కొడుకు, కూతురు) కలిసి జిల్లాలోని పిండ్రాయి సరఫ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. కుమారి భర్త జొగేశ్‌ ఉయ్కే కొన్నేళ్ల క్రితమే మరణించడంతో పిల్లల్ని పోషించడానికి ఆమె కూలీ పనికి వెళ్తుండేవారు. ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని భావిస్తున్న ఆమెకు 9వ తరగతి చదువుతున్న కొడుకు సక్రమంగా స్కూల్‌కు వెళ్లకపోవడం తీవ్ర బాధ కలిగించేది.

ఎప్పటిలాగే ఆ బాలుడు శుక్రవారం కూడా బడికి వెళ్లలేదు. స్కూల్‌కు వెళ్లకుండా తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కుమారి తన కొడుకును అక్కడి నుంచి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తరువాత స్కూల్‌కు వెళ్లనందుకు అతన్ని కర్రతో కొట్టారు. దీనిపై ఆగ్రహించిన ఆ బాలుడు పక్కనే ఉన్న ఇనుప రాడుతో తన తల్లిపై దాడి చేశాడు. దీంతో కుమారి అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. ఆ తరువాత బాలుడు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి తన రక్తపు మరకలు అంటిన బట్టలను మార్చుకుని దగ్గర్లోని బంధువుల ఇంటికి పారిపోయాడు. తొలుత దీనిని అనుమానస్పద మృతిగా భావించి విచారణ చేపట్టిన హివర్‌కేది పోలీసులు.. ఆ ఇంట్లో దొరికిన ఆధారాలను బట్టి కుమారి కొడుకే ఈ హత్య చేశాడనే నిర్దారణకు వచ్చారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతన్ని జువైనల్‌ కోర్టు ముందు హాజరు పరిచి జువైనల్ హోమ్‌కు తరలించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు