బాలుడిని బలిగొన్న టిప్పర్‌

24 Feb, 2019 09:12 IST|Sakshi

కరీంనగర్‌క్రైం: వారిది నిరుపేద కుటుంబం. ఓ ప్రమాదంలో తల్లి రెండుకాళ్లు విరిగాయి. ఇంట్లోనే చికిత్స పొందుతోంది. తల్లికి మందుల కోసం కరీంనగర్‌ వెళ్లిన కొడుకును తిరుగుపయనంలో టిప్పర్‌ బలిగొంది. ఈ ఘటన కరీంనగర్‌ శివారులోని పద్మనగర్‌లో శనివారం చోటు చేసుకుంది. మృతుడికి కొత్తపల్లి మండలం చింతకుంట అనుబంధ గ్రామం శాంతినగర్‌. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం చింతకుంట అనుబంధగ్రామం శాంతినగర్‌కు చెందిన సత్యనారాయణ ఆటో నడిపిస్తూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం కరీంనగర్‌ నుంచి చింతకుంటకు ముగ్గురు ప్రయాణికులతో బయల్దేరాడు. పద్మనగర్‌ చేరుకోగానే వేములవాడ వైపునుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది.ప్రమాదంలో శాంతినగర్‌కు చెందిన ఎండీ. ఇర్ఫాన్‌(12)అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ సత్యనారాయణ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా హుస్నా బాద్‌ మండలం అంకూస్‌తండాకు చెందిన ఎం. ఐలయ్య(55) తీవ్రంగా గాయపడ్డారు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

తల్లి మందుల కోసం వచ్చి.. 
కొత్తపల్లి మండలం చింతకుంట అనుబంధగ్రామం శాంతినగర్‌కు చెందిన ఎండీ. ఇర్ఫాన్‌(12) చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ప్రమాదంలో ఇర్ఫాన్‌ తల్లికి రెండుకాళ్లు విరిగాయి. స్థానికులు అందరూ కలిసి డబ్బులు పోగుచేసి అమెకు చికిత్స అందిస్తున్నారు. తండ్రి కరీంనగర్‌లో కూరగాయల మార్కెట్లో మిఠాయిలు విక్రయిస్తుంటాడు. ఇర్ఫాన్‌ పాఠశాలకు వెళ్తూ.. తల్లికిసేవలు చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పాఠశాలకు వెళ్లి వచ్చాడు. తల్లికి మందులు లేకపోవడంతో కరీంనగర్‌కు వచ్చాడు. మందులు తీసుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. పద్మనగర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న సీఐ దేవారెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 

స్థానికుల ఆందోళన.. 
ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనస్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. ఈ స్థలంలోనే తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. అధికారులు నివారణ చర్యలు తీసుకోవాడం లేదని ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు రెండుగంటల పాటు వాహనాలు కదల్లేదు. సీఐ దేవారెడ్డి స్థానికులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.  

మరిన్ని వార్తలు