అఖిల్‌ ఎక్కడ?

24 Jun, 2019 07:30 IST|Sakshi
తప్పిపోయిన బాలుడు, అఖిల్‌ బాలుని తండ్రి కపూర్య

ఆరునెలల క్రితం అక్కన్నపేట స్టేషన్‌లో అదృశ్యమైన బాలుడు

తల్లడిల్లుతున్న బాలుని తండ్రి

బాలున్ని రైలులో అపహరించుకుపోయినట్లు అనుమానం

రామాయంపేట(మెదక్‌): మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్‌వద్ద సుమారు ఆరునెలలక్రితం అదృశ్యమైన గిరిజన బాలుని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో సదరు బాలుని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు బాలుని ఆచూకీ కోసం తల్లడిల్లుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాకు చెందిన లంబాడి కపూర్య, అతని రెండేళ్ల కుమారుడు అఖిల్‌ గతంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో కాలువిరిగి ఏపని చేసుకోలేని స్థితిలో విధిలేక కపూర్య బిక్షాటన మార్గం ఎంచుకున్నాడు. ఇదే సమయంలో అతని భార్య.. కొడుకును, భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తన కుమారునితోపాటు రామాయంపేటకు వచ్చిన కపూర్య బిక్షాటన ద్వారా కొద్దిరోజులు గడిపాడు.

బిక్షాటనకై రామాయంపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కపూర్య రాత్రి అక్కడే తన కుమారునితోపాటు పడుకొని ఉదయం లేచిచూసేసరికి తన కొడుకు కనిపించలేదు. దీనితో అంతటా గాలించిన కపూర్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానితులను విచారించడంతో పాటు అంతటా గాలించినా బాలుని ఆచూకీ లభించలేదు. రైలులో ప్రయాణిస్తున్న దూరప్రాంతానికి చెందినవారే బాలున్ని అపహరించుకుపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా మహారాష్ట్రకు చెందినవారే బాలున్ని అపహరించుకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన కుమారుని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న కపూర్య అవిటితనాన్ని సైతం లెక్కచేయకుండా తిరుగుతున్నాడు. బాధపడుతున్నాడు. బాలుని ఆచూకీ విషయమై ప్రయత్నిçస్తున్నామని స్థానిక ఎస్‌ఐ మహేందర్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు