పబ్‌జీ గేమ్‌ ఆడొద్దన్నందుకు..

17 Apr, 2019 10:40 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : పబ్‌జీ గేమ్‌ వ్యసనంగా మారి యువకుల ప్రాణాలను బలితీసుకుంటోంది. గత నెల 22న పబ్‌జీ గేమ్‌ అతిగా ఆడటం వల్ల మెడ నరాలు పూర్తిగా దెబ్బతినడంతో జగిత్యాలకు చెందిన సాగర్‌ అనే యువకుడు మరణించాడు. ఆ సంఘటన జరిగి నెల తిరగకముందే తాజాగా మరో సంఘటన కలకలం రేపుతోంది. పబ్‌జీ గేమ్‌ ఆడవద్దని తల్లి మందలించటంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్థి శ్రేయస్‌ పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యాడు. గత కొద్దిరోజులుగా గంటల తరబడి ఆ గేమ్‌ ఆడుతూ గడుపుతున్నాడు.

ఇది గమనించిన అతడి తల్లి పబ్‌జీ గేమ్‌ ఆడవద్దని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రేయస్‌ గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలోకి వెళ్లిన శ్రేయస్‌ ఎంత సేపటికి డోర్‌ తియ్యకపోవటంతో స్థానికులు డోర్‌ బద్దలు కొట్టి చూడగా! శ్రేయస్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అతన్ని వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. శ్రేయస్‌ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.

చదవండి: పబ్‌జీతో జగిత్యాల యువకుడు బలి

మరిన్ని వార్తలు