కొట్టి.. మట్టిలో పూడ్చేశాడు..

2 Jun, 2020 10:23 IST|Sakshi
మృతదేహాన్ని పూడ్చిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై

మహిళను హత్య చేసిన ప్రియుడు

మృతురాలి కుమార్తె సమాచారంతో వెలుగులోకి..

ఊపిరి ఉండగానే పాతి పెట్టాడని బాలిక ఆవేదన

ఐదురోజుల అనంతరం పోలీసుల దృష్టికి..

మృతదేహం వెలికితీత

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కొడవలూరు: ఆరునెలలుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి కిరాతకంగా కొట్టి మట్టిలో పాతేశాడు ఆమె ప్రియుడు. మృతురాలి కుమార్తె ద్వారా ఐదురోజుల అనంతరం ఈ దారుణం వెలుగు చూసింది. సోమవారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మండలంలోని గండవరం సమీపంలోని దగదర్తి మండల సరిహద్దు ప్రాంతమైన గొట్లపాళెం వద్ద కాలువకట్టపై పాక వేసుకుని పొన్నూరు సుభాషిణి (36) అనే గిరిజన మహిళ ఉండేది. సంజీవనగర్‌కు చెందిన స్వాములు అలియాస్‌ దేవుడు అనే వ్యక్తితో ఆమె ఆరునెలలుగా సహజీవనం చేస్తోంది. కాగా ఆమెకు గతంలో దగదర్తి గిరిజన కాలనీకి చెందిన రమణయ్య అనే వ్యక్తితో వివాహం జరగ్గా వారు కొన్నేళ్ల క్రితమే విడిపోయారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. సుభాషిణికి సాములుతో పరిచయమేర్పడగా, వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా సుభాషిణిపై స్వాములుకి అనుమానం ఉంది. ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. అలా జరిగినప్పుడల్లా ఆమె పుట్టింటికి వెళుతుండేది. తర్వాత స్వాములు వెళ్లి ఆమెను తీసుకొస్తుండేవాడు.

గొడవపడి..
గత నెల 27న కాలువకట్టపై ఉన్న పాకలో సుభాషిణి, స్వాములు మద్యం సేవించి గొడవ పడ్డారు. అదేరోజు రాత్రి స్వాములు ఆమెపై కిరాతంగా దాడి చేసి ఇంటి వెనుక గుంత తీసి పూడ్చివేశాడు. ఈ విషయాన్ని గమనించిన మృతురాలి ఏడేళ్ల కుమార్తె ధనమ్మను స్వాములు బెదిరించడంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. తల్లిని చంపి పాతి పెట్టిన విషయాన్ని బాలిక సోమవారం ఆమె పెద్దమ్మ దృష్టికి తీసుకెళ్లింది. వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతురాలి కాళ్లు, చేతులు కన్పిస్తుండడంతో కొడవలూరు పోలీసుల దృష్టికి తెచ్చారు. కోవూరు సీఐ జీఎల్‌ శ్రీనివాసరావు, కొడవలూరు ఎస్సైలు కె.వీరప్రతాప్, పి.శ్రీనివాసులురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు. ధనమ్మను విచారించగా, తన తల్లి ప్రాణంతో ఉండగానే మట్టిలో పాతేశాడని చెప్పి కన్నీరు పెట్టుకోవడం అందర్నీ కలిచి వేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడు పట్టుకుంటామని తెలిపారు.(ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు