ఎల్లలు దాటిన వంచన

30 Jul, 2018 08:21 IST|Sakshi

బెంగళూరులో ప్రేమ, లండన్‌లో సహజీవనం  

పెళ్లికి ససేమిరా

మోసగానిపై బాధితురాలి ఫిర్యాదు  

బనశంకరి: కామాంధులు ఉద్యాననగరిలోనే కాదు.. విదేశాల్లోనూ తెగబడుతున్నారు. పథకం ప్రకారం యువతిని లండన్‌కు పిలిపించుకున్న యువకుడు ఆమెతో సహజీవనం వెలగబెట్టాడు. పెళ్లి విషయం ఎత్తేసరికి నిజస్వరూపం చూపించాడు. దీంతో బాధితురాలు మోసపోయినట్లు తెలుసుకుంది. నమ్మించి మోసగించిన ప్రియునిపై బాధిత యువతి రాష్ట్ర మహిళా కమిషన్‌కు పిర్యాదు చేసింది. వివరాలు.. బెంగళూరులోని రామమూర్తినగర కల్కెర నివాసి వంచనకు గురైన యువతి. అదే ప్రాంతానికి చెందిన సంజయ్‌ అనే యువకుడు సదరు యువతితో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. వీరి ప్రేమ విషయం తెలిసిన సంజయ్‌ కుటుంబసభ్యులు అతన్ని చదువు పేరుతో లండన్‌కు పంపించారు. అక్కడికెళ్లిన సంజయ్‌.. యువతికి ఫోన్లు, మెయిల్‌చేసి నీవు ఇక్కడికి వస్తే ఇద్దరు వివాహం చేసుకుందామని తీయగా చెప్పాడు. ఇతడి మాటలు నమ్మిన యువతి ఇంట్లో  ఎలాగోలా ఒప్పించి లండన్‌కు చేరుకుంది.

తల్లిదండ్రుల రౌడీయిజం  
లండన్‌లో సంజయ్, యువతి కలిసి చదువుకుంటూ ఒకే రూమ్‌లో సహ జీవనం సాగించారు. కానీ ఇటీవల సంజయ్‌ తల్లిదండ్రులకు ఇద్దరూ లండన్‌లో ఉన్నట్లు తెలియడంతో తల్లికి గుండెపోటు అని చెప్పి సంజయ్‌ను నగరానికి రప్పించుకున్నారు. సంజయ్‌ నగరానికి  చేరుకోగానే యువతి తల్లిదండ్రులను కలిసి బెదిరించసాగారు. యువతి గురించి చెడుగా ప్రచారం చేశారు. యువతి తల్లిదండ్రులు ఆమెకు సమాచారం తెలపడంతో ఆమె కూడా బెంగళూరుకు చేరుకుంది. సంజయ్‌ను కలిసి పెళ్లి చేసుకుందామని కోరగా, అతడు ససేమిరా అన్నాడు. ఈ నేపథ్యంలో యువతి రామమూర్తినగర పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగానే సంజయ్‌ మళ్లీ లండన్‌కు ఉడాయించాడు. మరోవైపు పోలీసులు కూడా ఫిర్యాదును నిరాకరించారు. గత్యంతరం లేని బాధితురాలు రాష్ట్ర మహిళా కమిషన్‌కు, నగర పోలీస్‌ కమిషనర్‌కు మొర పెట్టుకుంది. 

మరిన్ని వార్తలు