ప్రియుడే చంపేశాడు

7 Oct, 2019 09:46 IST|Sakshi
హంతకుడు రంగస్వామి ,డిగ్రీ విద్యార్థిని

సాక్షి, అనంతపురం ,గుత్తి: ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందన్న నెపంతో ప్రియుడే మట్టుబెట్టాడు. వివరాల్లోకి వెళితే గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డు(షాలోన్‌ నగర్‌)లో నివాసముంటున్న ఓ డిగ్రీ విద్యార్థిని (మైనర్‌) శనివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా హంతకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జక్కల చెరువుకు చెందిన వాయల రంగస్వామి (ఇతడూ మైనరే) అనే వ్యక్తి నుంచి విద్యార్థినికి కాల్‌ వచ్చింది. దీంతో సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు ఇబ్రహీం, రాజేష్‌లు హత్య చేసింది ప్రియుడు వాయల రంగస్వామి అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే జక్కల చెరువు గ్రామానికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలించి తమ దైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని రంగస్వామి అంగీకరించాడు.

అయితే విచారణలో హంతకుడు పలు ఆసక్తికర విషయాలు చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వాయల రంగస్వామి, సదరు విద్యార్థిని ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇంటర్‌ పూర్తి అయ్యాక డిగ్రీకి తలా ఒక కాలేజీలో చేరారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని మరో విద్యార్థితో చనువుగా ఉంటున్నట్లు తెలుసుకున్న రంగస్వామి ఆమెను పలుసార్లు హెచ్చరించాడు. ఆమె వినిపించుకోలేదని మట్టుబెట్టాలని పథక రచన చేశాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకు ఫోన్‌ చేసి మీ ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన ఆమెతో గొడవ పెట్టుకున్న రంగస్వామి తన వెంట తెచ్చుకున్న బైక్‌ క్లచ్‌ వైర్‌ను ఆమె గొంతుకు బిగించి ఆపై తలను గోడకు బాదాడు. అంతటితో ఆగకుండా చున్నీని మెడకు బిగించి ఇంటి కాంపౌండ్‌ వాల్‌ ఆవలకు పడేసి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

మరిన్ని వార్తలు