ప్రేమోన్మాది ఘాతుకం

6 Apr, 2019 13:08 IST|Sakshi
సితారాబాను, ఇనాముల్లా (ఫైల్‌)

పెళ్లికి నిరాకరించిన ప్రియురాలి హత్య

ఆపై తానూ ఆత్మహత్య సేలంలో కలకలం

చెన్నై, సేలం: రెండేళ్లుగా వివాహేతర సంబంధం కలిగిఉన్న మహిళ తనతో పెళ్లికి నిరాకరించడంతో ఆవేదన చెందిన వ్యక్తి ఆ మహిళను కత్తితో నరికి చంపి, ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సేలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

సేలం నగరంలో రైల్వే స్టేషన్‌ సమీపంలో కాసా కారనూర్‌ అనే ప్రాంతంలో ఒక ఐస్‌ క్రీమ్‌ దుకాణం నడుపుతున్న వ్యక్తి పాండ్యరాజన్‌. ఈ దుకాణంలో గత నాలుగేళ్ల క్రితం ఆజాద్‌ నగర్‌కు చెందిన సెరిన్‌ సితారాబాను (25) పనికి చేరింది. ఈమె భర్త నుంచి విడిపోయి జీవిస్తోంది. ఈ క్రమంలో సితారాబానుకు పక్క దుకాణంలో పని చేస్తున్న ఇనాముల్లా (54)తో పరిచయం ఏర్పడింది. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ఐస్‌క్రీం దుకాణానికి ఇనాముల్లా వచ్చాడు.

సితారాబాను ఉన్న గదికి వెళ్లి తలుపు వేసి లోపల గడియపెట్టాడు. తర్వాత తాను తీసుకొచ్చిన కత్తితో సితారాబానును నరికి హత్య చేశాడు. ఆ సమయంలో ఆమె అరుపులు విని స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తలుపులు తట్టగా తెరుచుకోలేదు. లోపలి వైపు తలుపు గడియ పెట్టి ఉంది. సమాచారం అందుకున్న సూరమంగళం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు తెరవడానికి ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సితారాబాను రక్తపు మడుగులో శవంగా పడి ఉండగా, పక్కనే ఉన్న ఫ్యాన్‌కు ఇనాముల్లా ఉరి వేసుకుని శవంగా వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు.

పెళ్లికి నిరాకరించినందుకే హత్య: పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో సెరిన్‌ సితారాబాను వివాహమై, విడాకులు పొందినట్టుగాను, అదే విధంగా ఇనాముల్లా కూడా విడాకులు పొందిన వ్యక్తి అని తెలిసింది. వీరి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు, ఈ స్థితిలో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇనాముల్లా ఒత్తిడి చేయగా అందుకు నిరాకరించడంతోనే ఆమెను హత్య చేశాడని తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించగా, ఇనాముల్లా రాసిన ఒక లేఖ చిక్కింది. అందులో.. సితారా భానుకు వివాహమై భర్త నుంచి విడాకులు పొందింది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. నాలుగేళ్లుగా తమకు పరిచయం ఉందని, గత రెండేళ్లుగా వివాహేర సంబంధం ఏర్పడినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి నా కుటుంబీకులు దూరమయ్యారు. దీంతో సితారాబానును వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నా. అయితే సితార నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈమెను నమ్ముకుని నా కుటుంబాన్ని వదిలి వచ్చాను. ఇప్పుడు అనాథగా మారాను. ఎంత బతిమాలినా ఆమె వివాహానికి ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్టు రాసి ఉంది. దీనిపై సూరమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు