ప్రియురాలి కారుతో ప్రియుడు పరారీ

25 Oct, 2019 09:48 IST|Sakshi

బంజారాహిల్స్‌: ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తూనే మరో యువతితో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ప్రియురాలి కారుతో ఉడాయించిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు ఎలహంకలో ఉంటున్న రీనాఫ్రాన్సిస్‌ అనే మహిళ 2011లో భారత్‌ మ్యాట్రిమోనీలో వివాహ ప్రకటన ఇచ్చింది. దీనిపై స్పందించిన బెంగళూరుకు చెందిన రాహుల్‌ ఫెర్నాండేజ్‌ అనే వ్యక్తి తాను బడా వ్యాపారినని తనకు ఎవరూ లేరని పరిచయం చేసుకున్నాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. 2012 జనవరి నుంచి ఇద్దరూ కలిసి ఉంటున్నారు.

అయితే రాహుల్‌ తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే మరికొందరు యువతులతో ప్రేమ పేరుతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా గుర్తించిన ఆమె గత కొద్ది రోజులుగా అతడిని దూరం పెడుతోంది. ఈ నెల 5న రాహుల్‌ ఆమెకు ఫోన్‌ చేసి నాలుగు రోజుల పాటు  కారు కావాలని కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించడంతో శివ అనే డ్రైవర్‌ బెంగళూరు వెళ్లి హోండా అమేజ్‌ కారును తీసుకొచ్చి రాహుల్‌కు అప్పగించాడు. అయితే వారం రోజులు గడిచినా రాహుల్‌ కారు ఇవ్వకపోగా ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బుధవారం   హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని డౌన్‌టౌన్‌ హోటల్‌లో ఉంటున్న రాహుల్‌ను కలిసి తన కారు ఇవ్వాలని కోరింది. అయితే రాహుల్‌ ఆమెను బయటికి నెట్టేసి కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ వచ్చింది. కొద్ది రోజులుగా అతను నటాషా అనే యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిందని, ఆమె కోసమే తన వద్ద కారు తీసుకెళ్లాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా