బాలుడి ఆచూకీ లభ్యం

24 Apr, 2018 10:19 IST|Sakshi
ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో బాలుడిని బంధువులకు అప్పగిస్తున్న స్టేషన్‌ రైటర్‌ రామకృష్ణ 

ద్వారకాతిరుమల : ఇంటి నుంచి తప్పిపోయి ద్వారకాతిరుమలకు చేరిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులకు ఆ బాలుడిని పోలీసులు సోమవారం అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడు తప్పిపోయి ఆర్టీసీ బస్సెక్కి ఆదివారం ద్వారకాతిరుమలకు చేరుకుని, అక్కడి నుంచి పోలీసుల సంరక్షణలోకి వెళ్లిన విషయం విదితమే.

ఈ ఘటనకు సంబంధించి సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా ఆ బాలుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. బాలుడి పేరు ఏసు అని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడని అతడి పిన్ని బత్తుల బుజ్జి పోలీసులకు తెలిపింది. తన సంరక్షణలోనే పెరుగుతున్నాడని చెప్పింది.

తమది కర్ణాటక రాష్ట్రంలోని గంగసముద్రమని, బతుకుదెరువు కోసం ఏలూరుకు వచ్చి స్థిరపడినట్టు వివరించింది. దెందులూరు మండలం చల్లచింతలపూడిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిన ఏసు ఆడుకుంటూ బస్సెక్కి ద్వారకాతిరుమలకు వెళ్లిపోయాడని, ఆ విషయం తెలియక తాము కంగారుగా చుట్టుపక్కల వెతికినట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రైటర్‌ రామకృష్ణ బాలుడు ఏసుని అతడి పిన్ని బుజ్జికి అప్పగించారు.

మరిన్ని వార్తలు