ఆకతాయి చేష్టలు...పంటలు బుగ్గిపాలు

2 Mar, 2018 10:14 IST|Sakshi
సంబేపల్లె మండలం గుట్టపల్లె వద్ద కొండలోని గడ్డికి నిప్పు పెట్టిన దృశ్యం

చోద్యం చూస్తున్న ఫారెస్టు.... అగ్నిమాపకదళ అధికారులు

ఆందోళనలో అన్నదాతలు

కడప అగ్రికల్చర్‌: ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల, విద్యుత్‌ షార్ట్‌సర్క్యూ వల్ల మామిడి, కంది, టమాటా, బుడ్డశగన పంటతోపాటు, వర్మీకంపోస్టు యూనిట్లు, డ్రిప్‌ పరికరాలు బుగ్గిపాలవుతున్నాయి. దీంతో రైతన్నలు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు.  విత్తనం మొదలుకొని పంట నూర్పిళ్ల దాకా అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు రాత్రింబవళ్లు స్వేదాన్ని చిందించి శ్రమించినా తీరా పంట దిగుబడులతో మంచి ఆదాయాన్ని పొందుతామనుకున్న తరుణంలో ఇలా అగ్గిపాలవుతుండడాన్ని అన్నదాత తట్టుకోలేకపోతున్నాడు. అడవులకు నిప్పుపెడితే కేసులు పెడతామని బీరాలు పలికిన అటవీశాఖ అధికారులు ఆకతాయిల ఆగడాలను  చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదని రైతు సంఘాలు బాహటంగా విమర్శిస్తున్నాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, టి. సుండుపల్లె, చిన్నమండెం, పెద్దముడియం, బి.కోడూరు, ఓబుళవారిపల్లె, పుల్లంపేట మండలాల సమీపంలో  కొండ, గుట్టలున్నాయి.

ఈ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయతోటలు, బుడ్డశగన పంట సాగులో ఉన్నాయి. రెండు నెలలుగా ఏదో ఒక చోట పంటతోటలు, చేలు తగలబడుతూనే ఉన్నాయి. దీనికి తోడు తుంపర, బిందు సేద్య పరికరాలు అగ్గిపాలయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీన రామాపురం మండలం చిట్లూరు దళితవాడకు చెందిన కౌలు రైతులు గంపాల వెంకటసుబ్బమ్మ, బాలిపోగు గంగమ్మ, చిన్నికృష్ణయ్య, వెంకటరమణ, ముసలిరెడ్డిపల్లెకు చెందిన రైతులు చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లకు చెందిన 150 ఎకరాల మామిడి చెట్లు, 30 ఎకరాల్లో సాగుచేసిన కందిపంట కాలిపోయింది. దీనికి ప్రధాన కారణం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నిప్పులు ఎగసిపడటమే. దీనివల్ల దాదాపు రూ.10లక్షల మేర నష్టం సంభవించింది.  అదే నెల 6వ తేదీన రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన కాటిగారి ప్రతాప్‌రెడ్డికి చెందిన 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కుప్ప కాలిపోయి రూ.2.50 లక్షల నష్టపోయినట్లు రైతు ఆవేదనతో తెలిపారు. 

ఆ నెల్లోనే 5వ తేదీన సంబేపల్లె మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన యువరాజా నాయుడు, రెడ్డి నారాయణకు చెందిన 30 ఎకరాల మామిడితోట దగ్ధమై రూ.12లక్షలు నష్టపోయినట్లు తెలిపారు. ఫిబ్రవరి1వ తేదీన లక్కిరెడ్డిపల్లె మండలం కాకుళారం గ్రామానికి చెందిన రైతు కత్తి రామచంద్ర, కత్తి వెంకటరమణ, గొర్లవీరుకు చెందిన 150 మామిడి చెట్లు ఆకతాయి చేష్టల వల్ల కాలిపోయాయి. దీంతో పాటు వర్మీకంపోస్టు యూనిట్‌ కూడా కాలిపోవడంతో మొత్తం రూ.5లక్షలు నష్టం సంభవించినట్లు  రైతులు తెలిపారు.  జనవరి నెల 28వ తేదీన పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి చెందిన రైతులు కటారి జకరయ్య, కటారి ప్రభాకర్‌ 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కల్లంలో దగ్ధం అయిందని, ఈ  ప్రమాదం వల్ల రూ.1.20లక్షలు నష్టపోయామని వాపోయారు. ఫిబ్రవరి   21వ తేదీన ఓబుళవారిపల్లె మండలం పెద్ద ఓరంపాడు గ్రామ మహిళా రైతు ఆళ్ల నరసమ్మకు చెందిన 2 ఎకరాల్లోని అరటి తోట, బోరు మోటారు, టేకు చెట్లు, కొబ్బరి చెట్లు, వర్మీకంపోస్టు యూనిట్టు కాలిబూడిదయ్యాయి. దీని కారణంగా రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత మహిళా రైతు వాపోయారు.  ఈ రైతులేకాదు జిల్లాలో చాలా మంది  పంటలు అగ్నికి ఆహుతై పోవడంతో ఏమి చేయలేని స్థితిలో ఆందోళన చెందున్నారు. 

చోద్యం చూస్తున్న  అధికారులు
గుట్టలకు, కొండలకు ఆకతాయిలు నిప్పుపెట్టకుండా నిరోధించాల్సిన ఫారెస్టు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కొండలు, గుట్టల సమీపాన ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉన్నా అలా చేయడం లేదని  రైతులు ఆరోపిస్తున్నారు.  ఏటా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఎందుకు నష్టాలు సంభవిస్తున్నాయనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.  అగ్నికి ఆహుతైన ఉద్యాన, వ్యవసాయ పంటలకు ప్రకృతి వైవరీత్యాల పథకంలోనైనా సాయం అందించాలని ప్రభుత్వానికి రైతులు విన్నవించుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు