అలాంటి పరిస్థితుల్లో.. మీరైతే ఏం చేసేవారు..!?

25 Mar, 2019 12:01 IST|Sakshi

గురుగ్రామ్‌: హోలీ పండుగ రోజున  హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ముస్లిం కుటుంబంపై దాదాపు 25 మంది దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. యూపీలోని భాగ్‌పట్‌ జిల్లాకు చెందిన సాజిద్‌తో సహా అతని కుటుంబ సభ్యులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మొత్తం సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం.. అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. సాజిద్‌ కుటుంబానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు ఈ వీడియో సాయపడింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ మహేశ్‌ కుమార్‌(24) అనే నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దినేశ్‌ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన దుండగుల్ని ఆదివారంలోగా అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకోకపోతే పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయిస్తామని ముస్లిమ్‌ ఏక్తా మంచ్‌ హెచ్చరించింది. 
(క్రికెట్‌ ఆడొద్దంటూ దాడి.. ఇక ఇక్కడ ఉండలేం..!)

ఇక ఈ ఘటన మొత్తాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రికరించిన సాజిద్‌ మేనకోడలు దానిష్ఠ సిద్దిఖీ (21)పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. దుండగులు తనవారిపై అకారణంగా దాడికి దిగుతున్న క్రమంలో ఆమె చాకచక్యంగా వ్యవహరించారు. కిందకి వెళ్లి అపాయంలో చిక్కుకోకుండా ధైర్యం కూడదీసుకుని.. తన తండ్రి సూచన మేరకు తతంగం మొత్తాన్ని సెల్‌పోన్‌లో చిత్రీకరించారు. ఇది గమనించిన దుండగులు దుర్భాషలాడుతూ ఆమెవైపు దూసుకొచ్చినా వెరవలేదు.

‘ఘటన జరిగిన సమయంలో నేను వంటగదిలో ఉన్నాను. కిందనుంచి పెద్దపెట్టున అరుపులు, కేకలు వినపించడంతో బయటికొచ్చి చూశాను. అప్పటికే మామయ్య కుటుంబ సభ్యులు, నా సోదరులపై దుండగులు కర్రలు, రాడ్లతో దాడి చేస్తున్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ మామయ్య హెచ్చరించాడు. దుండగుల్లో ఒకడు.. ‘మీరంతా పాకిస్తాన్‌ వాళ్లారా..?’ అంటూ బూతులు తిడుతున్నాడు. ఈ దౌర్జన్యకాండ 30 నిముషాలపాటు కొనసాగింది. దివ్యాంగుడైన నాన్నా, నేను టెర్రస్‌పైకి వెళ్లాం. తండ్రి సూచన మేరకు సెల్‌ఫోన్‌ తీసుకొచ్చి ఘటన మొత్తాన్ని వీడియో తీశాను’ అని దానిష్ఠ చెప్పారు.

మరిన్ని వార్తలు