వీడు మామూలోడు కాడు : వైరల్‌

18 Aug, 2019 16:22 IST|Sakshi

లండన్‌ : అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టాడు. తెలివిగా దోచుకున్నానని సంబరపడి అడ్డంగా దొరికిపోయాడు. విలాసవంతమైన జీవితం గడపాలన్న ఓ పనివాడి దుర్బుద్ధి అతడిని జైలు పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన రస్సెల్‌ లిబ్రండ అక్కడి హాత్రో విమానాశ్రయంలోని ‘‘బ్రేజన్‌ బూట్స్‌’’ దుకాణంలో పనిచేసేవాడు. కానీ, కొన్ని నెలల క్రితం పనిమానేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత షాపు యాజమాన్యం నగదు లావాదేవీల్లో పెద్ద మొత్తం తేడాను గమనించారు. ఇందుకు గల కారణం తెలుసుకోవటానికి సీసీ కెమెరాలను పరిశీలించి చూడగా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. అక్కడ పని మానేసి వెళ్లిపోయిన లిబ్రండ డబ్బు దొంగలించటం వారికంట పడింది. డబ్బుల కౌంటర్‌ దగ్గర ఉండే లిబ్రండ కస్టమర్లు ఇచ్చిన నగదును(ముఖ్యంగా పెద్దనోట్లను) మడతపెట్టి అటు ఇటు చూసి టక్కున జేబులో పెట్టుకునే వాడు. తన తలపైనే సీసీ కెమెరా ఉందన్న సంగతి తెలియక విచ్చలవిడిగా డబ్బు దొంగలించాడు. ఇలా ఒక వారంలో 700 పౌండ్‌ స్టెర్లింగులు మాయం చేశాడు. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 130 సార్లు మొత్తం 16000(రూ. 13లక్షలు)  పౌండ్ స్టెర్లింగులు దొంగలించాడు.



దీంతో షాపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లిబ్రండ కోసం అతడి ఇంటికి వెళ్లి చూడగా ఖరీదైన బట్టలు, బంగారు నగలు, కంప్యూటర్లు, ఐ ఫోన్స్‌, టీవీలు దర్శనమిచ్చాయి. వాడ్‌రోబ్‌లోని బ్యాగ్‌లో లిబ్రండ దాచుకున్న 6000  పౌండ్ స్టెర్లింగులు దొరికాయి. దీంతో లిబ్రాండాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొద్దిరోజుల తర్వాత కోర్టులో హాజరుపరచగా 18నెలల జైలు శిక్షతో పాటు 2000 పౌండ్ స్టెర్లింగులు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

మరిన్ని వార్తలు