నాలుగో సింహం... అడుగడుగునా లంచం!

21 Jun, 2019 09:01 IST|Sakshi

రాజధాని పోలీసుల్లో ఇంకా లంచావతారులు

మామూళ్ల కనుమరుగుతో కేసుల్లోనే కక్కుర్తి

కలకలం సృష్టిస్తున్న ఏసీబీ వరుస దాడులు

మొన్న బొల్లారం ఎస్సై, కానిస్టేబుల్‌ తాజాగా మొఘల్‌పుర ఎస్సై

సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సహా ఉన్నతాధికారులు ఎన్ని విధానాలు అమలులోకి తీసుకువస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అదును చూసుకుని లంచాలు లాగిస్తున్నారు. ఓ విధానానికి చెక్‌ పడితే మరో పంథాలో తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనÆóరేట్‌ పరిధిలో వరుసగా జరుగుతున్న  ఏసీబీ దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. బొల్లారం ఠాణా సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై), కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు సోమవారం ట్రాప్‌ చేశారు. ఈ ఘటన మరిచిపోకముందే గురువారం మొఘల్‌పుర ఎస్సై బాబు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 

సకల సౌకర్యాలు కల్పించినా...
ఒకప్పుడు పోలీసుస్టేషన్లు భూత్‌ బంగ్లాలను తలపించేవి. అధికారులు, సిబ్బంది తిరిగేందుకు సరైన వాహనాలు కూడా ఉండేవి కాదు. కీలక కేసుల దర్యాప్తు కోసం ఆర్థిక సహాయం దొరికేది కాదు. ఈ పరిస్థితులకు తోడు ‘స్వకార్యం’లో భాగంగా అవినీతి రాజ్యమేలేది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన నిందితుడే కాకుండా బాధితుడూ బోరుమనే పరిస్థితులు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు విభాగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఓ పక్క మౌళిక వసతులు మెరుగవడంతో పాటు టెక్నాలజీ వినియోగం, నెలసరి ఠాణాల నిర్వహణ ఖర్చులు అందించడం తదితర చర్యలు చేపట్టారు. దీనికి తోడు పనితీరును మందించడం, ఎక్కడిక్కడ పరిశీలనలతో అధికారులు, సిబ్బంది తీరులో మార్పు వస్తుందని భావించారు. 

సిటీ నుంచే ఏరివేత...
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి సిబ్బంది, అధికారుల అవినీతిపై దృష్టి సారించారు. స్టేషన్‌ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా రూ.75 వేలు మంజూరు చేస్తూ ‘కలెక్షన్స్‌’ విధానాన్ని పారద్రోలాలని భావించారు. అంతేగాక 2015లోనే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయన సిటీలో ఉన్న వసూల్‌ రాజాలపై దృష్టి పెట్టారు. నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌ ద్వారా లోతుగా ఆరా తీయించి, దాదాపు 100 మందితో కూడిన జాబితాను రూపొందించారు. వీరిని సిటీ ఆరŠడ్మ్‌ రిజర్వ్‌ విభాగానికి బదిలీ చేయించారు. దీంతో మామూళ్లు, వసూళ్లు కొంత మేరకు తగ్గాయి. అయితే ‘అధిక సొమ్ముకు’ అలవాటుపడిన కొందరు కింది స్థాయి అధికారులుతమ పని తీరును మార్చుకోవట్లేదు. డబ్బు కోసం కేసుల్లోనే కక్కుర్తి దందాలు ప్రారంభించారు. బాధితులు, నిందితులు అనే తేడా లేకుండా చాన్స్‌ దొరికినప్పుడల్లా వసూళ్లకు పాల్పడుతున్నారు.  

ఏసీబీ అదుపులో మొఘల్‌పురా ఎస్సై
యాకుత్‌పురా: బైండోవర్‌ కాకుండా చూసేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేసిన మొఘల్‌పురా ఎస్సై బాబును గురువారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాసులు, శ్రీకాంత్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రహీం శాలిబండలో మెన్స్‌వేర్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రహీంకు కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు ఇటీవల ఘర్షణ పడటంతో మొఘల్‌పురా పోలీసులు మహ్మద్‌ అబ్దుల్‌ రహీం, సోదరుడు ఖయ్యూంపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రహీంను ఆర్డీఓ కోర్టులో బైండోవర్‌ చేయాల్సి ఉంది. బైండోవర్‌ చేయకుండా చూసేందుకుగాను రహీం మొఘల్‌పురా ఎస్సై బాబును ఆశ్రయించగా, అతను రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. రహీం దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బాబు రహీం నుంచి రూ.30 వేలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్, హరీష్‌ పాల్గొన్నారు.  

కాదేదీ వసూలుకు అనర్హం...
ఈ లంచాలు తీసుకోవడంలో అధికారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. కేసును బట్టి, నిందితులు, బాధితుల తీరుతెన్నులను బట్టి వసూళ్లు ఉంటున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఏసీబీకి చిక్కిన వారి కేస్‌స్టడీలే ఇందుకు నిదర్శనం.  
ఆసిఫ్‌నగర్‌ ఎస్సై గౌస్‌ ఖాన్‌ రూ.25 వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. పాన్‌మసాలాలు సరఫరా చేసే వ్యాపారిని నెలవారీ మామూళ్లు డిమాండ్‌ చేసిన గౌస్‌ ఖాన్‌ కొంత మొత్తం తీసుకున్నప్పటికీ అదనంగా డిమాండ్‌ చేసి అడ్డంగా దొరికేశాడు.  
పాతబస్తీలోని మహిళా ఠాణాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రవికుమార్‌ భార్యభర్తల మధ్య పంచాయితీకి సంబంధించి నమోదైన కేసులో భర్తకు స్టేషన్‌ బెయిల్‌ ఇప్పిస్తానంటూ చెప్పి రూ.30 వేలు డిమాండ్‌ చేసి ఏసీబీ చిక్కారు.
చిలకలగూడ ఠాణా డిటెక్టివ్‌ ఎస్సై సీహెచ్‌ వెంకటాద్రి, కానిస్టేబుల్‌ రాజేష్‌ గత జూలైలో ఓ చోరీ కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు రికవరీ చేసిన బైక్‌ను ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వడానికీ డబ్బు డిమాండ్‌ చేసి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు.  
హుమాయూన్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ ఎస్సై సీహెచ్‌ శ్రీకాంత్, కానిస్టేబుల్‌ మహ్మద్‌ రహీం పాషా రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకున్నప్పుడు అతడికి కొట్టకుండా ఉండటానికి, బెయిల్‌ పొందడానికి సహకరించడానికీ రూ.లక్ష డిమాండ్‌ చేశారు.
రూ.80 వేలు తీసుకున్నప్పటికీ మిగిలిన మొత్తం కోసం వేధించి  పట్టుబడ్డారు.  
చైతన్యపురి ఎస్సై ఈరోజి రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఓ మైనర్‌ బాలికను వేధిస్తున్న కేసులో న్యాయ వాదిపై కేసు నమోదైంది. దీని దర్యాప్తు పూర్తి చేసి, న్యాయస్థానం అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ఈరోజి లంచం డిమాండ్‌ చేశాడు.  
బొల్లారం ఎస్సై బ్రహ్మచారి, కానిస్టేబుల్‌ నగేష్‌ ఓ దాడి కేసులో ముందస్తు బెయిల్‌ తీసుకునే విషయంలో నిందితుడికి సహకరించడానికి రూ.20 వేలు డిమాండ్‌ చేసి పట్టుబడ్డారు.
ఓ వ్యక్తిని బైండోవర్‌ చేసే విషయంలో అతడికి అనుకూలంగా వ్యవహరించడానికి మొఘల్‌పుర ఎస్సై బాబు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేశారు.  

మరిన్ని వార్తలు